Amazon: ఉద్యోగులకు కార్పోరేట్ దిగ్గజం బిగ్ షాక్
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. లక్షలాది ఉద్యోగాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయనే చెప్పాలి. ఎప్పుడు ఏ కార్పోరేట్ కంపెనీ కఠినంగా వ్యవహరిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అమెజాన్ వంతు వచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించేందుకు సంస్థ సిద్దమైంది. ఈ వారంలో అంటే మంగళవారం దాదాపు 16 వేల ఉద్యోగాలను తొలగించడానికి రెడీ అయిపొయింది. ఇప్పటికే ఉద్యోగులకు క్లారిటీ కూడా ఇచ్చేసింది.
ఖర్చులు తగ్గించుకునేందుకు అమెజాన్ సంస్థ కీలక అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ తొలగింపులు ఇక్కడితో ఆగేవి కాదని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది మరో రెండు దఫాలుగా ఉద్యోగులను ఆ సంస్థ తొలగిస్తుంది. 2026 మధ్య నాటికి దాదాపు 30,000 ఉద్యోగులను తొలగిస్తున్నారు. అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నాటికి మొత్తం 50 వేల ఉద్యోగులను పక్కన పెట్టే ఆలోచనలో సంస్థ ఉంది. భారత్ లో ఈ ప్రభావం భారీగా పడే అవకాశం ఉంది.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మరియు ప్రైమ్ వీడియోలోని ఉద్యోగులు ప్రమాదంలో ఉన్నారని చెబుతున్నారు. 2025 చివరిలో రాయిటర్స్ కథనం ప్రకారం, అమెజాన్ విస్తృత పునర్నిర్మాణ ప్రయత్నంలో భాగంగా దాదాపు 30,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక తెలిపింది. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.57 మిలియన్ల మందిని నియమించుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమైంది. అమెజాన్లో తొలగింపులు.. AWS, ప్రైమ్ వీడియో, రిటైల్ ఆపరేషన్లు, అమెజాన్ అంతర్గత హెచ్ ఆర్ విభాగం అయిన పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ (PXT) విభాగంతో సహా అనేక కీలక విభాగాలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు.






