YCP: ప్లీజ్ అసెంబ్లీకి వెళ్ళు అన్నా..!
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట సభలు ఎంతో కీలకం. అసెంబ్లీ, పార్లమెంట్ సహా పలు వేదికల్లో ఎంత మాట్లాడితే అంత మైలేజ్. పని చేసామా లేదా సంగతి పక్కన పెడితే.. సభలో సబ్జెక్ట్ మాట్లాడితే వచ్చే ఇమేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) మాత్రం అసెంబ్లీ సమావేశాలను మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తా అంటూ భీష్మించుకుని కూర్చున్నారు జగన్. దీనితో ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బడ్జెట్ సమావేశాలకు అయినా వెళ్ళాలి అంటూ కోరుతున్నారు.
వచ్చే నెల 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలను(Budget Session) రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. 14వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతారు. కాబట్టి బడ్జెట్ లో ఉన్న లోపాలపై సభలోనే మాట్లాడితే ప్రభుత్వ వైఖరి అర్ధమవుతుంది. సంక్షేమ కార్యక్రమాలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, శాఖలకు కేటాయింపులు ఇలా ప్రతీ ఒక్కటి సభలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోతే సభ నుంచి బాయ్ కాట్ చేసి బయటకు వచ్చే ఆప్షన్ కూడా జగన్ కు ఉంది. అయినా సరే జగన్ మాత్రం సభలో అడుగు పెట్టడానికి ఇష్టపడటం లేదు.
దీనితో టీడీపీ క్యాడర్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తోంది. గతంలో జగన్ నవ్విన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తిడుతోంది. ఇక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ కూడా చెలరేగిపోతున్నారు. ఇవన్నీ చూసిన వైసీపీ క్యాడర్.. అన్నీ సభకు వెళ్ళు అన్నా ప్లీజ్ అంటూ కోరుతున్నారు. మీడియా సమావేశాలు ఎప్పుడైనా పెట్టవచ్చు, శాసన సభ ప్రతీ రోజు జరగదు కదా..? మండలిలో మన వాళ్ళు మాట్లాడటం కాదు మీరు మాట్లాడాలి అంటూ క్యాడర్ అన్నను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్ ఆలోచన ఏంటో చూడాలి.






