Iran: ఆందోళనకారులను ఇరాన్ భద్రతా బలగాలు ఊచకోత కోశాయా..?
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన నిరసనలు.. భారీ రక్తపాతాన్ని మిగిల్చాయా..? నిరసనకారులను దేశద్రోహులుగా ప్రకటించిన ఇరాన్ అధినాయకత్వం.. వారికి సమాధి కట్టిందా…? లేటెస్టుగా ఓ పత్రిక ప్రకటించిన కథనం.. ఇదే చెబుతోంది. ఒక్క జనవరి 8, 9వ తేదీల్లోనే ఇరాన్ వీధుల్లో చోటుచేసుకొన్న హింసాత్మక ఘటనల్లో దాదాపు 30 వేలమంది చనిపోయి ఉండవచ్చని స్థానిక ఆరోగ్యశాఖ అధికారులను ఉటంకిస్తూ టైమ్స్ కథనం ప్రచురించింది. భారీ సంఖ్యలో ప్రజలను ఇరాన్ భద్రతా దళాలు ఊచకోత కోశాయని.. మృతదేహాల తరలింపునకు అంబులెన్సుల స్థానంలో 18 చక్రాల ట్రక్కులను వినియోగించాల్సి వచ్చినట్లు తెలిపింది.
ఆర్థిక సంక్షోభంతో ఇటీవల ఇరాన్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా ప్రదేశాల్లో నిరసనలు జరిగాయి. దీంతో ఆందోళనకారులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. జనవరి 21న ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన 3,117 కంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అమెరికా కేంద్రంగా పనిచేసే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ ఇప్పటివరకు 5,459 మరణాలను ధ్రువీకరించగా.. మరో 17,031 మరణాలపై సమాచారం సేకరిస్తోంది.
ఇటీవలి పరిణామాలపై అమెరికా హెచ్చరికలు, ఆ దేశం దాడి చేస్తుందనే భయాల నడుమ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అధికారులు టెహ్రాన్‌లోని సురక్షితమైన బంకర్‌కు తరలించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ తన కార్యాలయ బాధ్యతలను చిన్న కుమారుడు మసూద్ ఖమేనీకి అప్పగించినట్లుగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా ఆయనే చూడనున్నట్లు తెలిపాయి.






