Fruits:పండ్లపై స్టిక్కర్లు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ నంబర్ల వెనుక దాగున్న అసలు రహస్యం ఇదే!
హైదరాబాద్: మనం మార్కెట్‌కు వెళ్ళినప్పుడు ఆపిల్స్, అరటి పండ్లు లేదా ఇతర ఖరీదైన పండ్లపై చిన్న చిన్న స్టిక్కర్లు ఉండటం చూస్తుంటాం. చాలామంది ఇవి కేవలం ధర కోసమో లేదా బ్రాండ్ కోసమో అనుకుంటారు. కానీ, ఆ స్టిక్కర్‌పై ఉండే PLU (Price Look Up) కోడ్ ఆ పండు నాణ్యతను, అది ఎలా పండిందో చెప్పే ఒక ‘రిపోర్ట్ కార్డ్’ వంటిది.
ఆ నంబర్ల అర్థం:
9తో మొదలైతే (5 అంకెలు): ఒకవేళ స్టిక్కర్ పై కోడ్ ‘9’ తో మొదలైతే (ఉదాహరణకు: 94011), అది పూర్తిగా సేంద్రీయ (Organic) పద్ధతిలో పండించినట్లు అర్థం. అంటే ఎలాంటి కెమికల్స్ వాడలేదని అర్థం.
4తో మొదలైతే (4 అంకెలు): కోడ్ ‘4’ తో మొదలైతే (ఉదాహరణకు: 4011), అది సంప్రదాయ పద్ధతిలో అంటే పురుగుమందులు, రసాయన ఎరువులు వాడి పండించారని అర్థం.
అసలు వీటిని ఎందుకు వాడతారు?
1929లో ‘ఫైఫ్స్’ అనే సంస్థ మొదటిసారి బ్రాండింగ్ కోసం స్టిక్కర్లను వాడగా, 1990 నుండి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కోడ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఇవి సూపర్ మార్కెట్లలో బిల్లింగ్ సులభం చేయడానికి, వినియోగదారులకు పారదర్శకత అందించడానికి ఉపయోగపడతాయి.
స్టిక్కర్ పొరపాటున మింగితే ఏమవుతుంది?
సాధారణంగా ఈ స్టిక్కర్లు తయారు చేసే కాగితం, జిగురు, సిరా అన్నీ ఎఫ్డిఏ (FDA) నిబంధనల ప్రకారం ‘ఫుడ్ గ్రేడ్’ తో తయారవుతాయి. కాబట్టి పొరపాటున ఒక స్టిక్కర్ తిన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఆరోగ్య దృష్ట్యా వాటిని తొలగించి పండ్లను కడుక్కుని తినడమే ఉత్తమం.
పర్యావరణంపై ప్రభావం: ప్రస్తుతం వాడుతున్న చాలా స్టిక్కర్లు పర్యావరణంలో త్వరగా కలవవు. అందుకే భవిష్యత్తులో భూమిలో కలిసిపోయేలా ఉండే పర్యావరణ హితమైన లేబుల్స్ తీసుకువచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.






