Messi: మెస్సీతో ఫేక్ సెల్ఫీ హల్చల్.. ఏఐ మాయలో మునిగిన సోషల్ మీడియా
హైదరాబాద్: సామాజిక మాధ్యమాలు, గూగుల్ జెమినీ, చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ (AI) సాధనాల రాకతో నిజం, అబద్ధం మధ్య తేడా గుర్తించడం కష్టమవుతోంది. ముఖ్యంగా ఆశ్చర్యం, హాస్యాన్ని కలిగించే పోస్టులు కుప్పలు తెప్పలుగా షేర్ అవుతున్నాయి. తాజాగా, అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో దిగిన ఫేక్ సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి.
ఏఐ సృష్టిలో ‘మెస్సీతో మేముసైతం’ హడావుడి
మెస్సీ హైదరాబాద్ పర్యటన, సీఎం ఎ. రేవంత్‌రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ లాంటి అంశాలు గత నెల రోజులుగా చర్చలో ఉన్నాయి. అయితే, మూడు రోజుల క్రితం ‘మెస్సీతో సెల్ఫీ దిగాలంటే రూ. 10 లక్షలు చెల్లించాలి. కేవలం వంద మందికే అవకాశం’ అనే వార్తలు వెలువడటంతో అసలు ఏఐ చిత్రాల హడావుడి మొదలైంది. రూ. 10 లక్షలు చెల్లించి ఫొటో దిగడం ఎందుకంటూ వ్యాఖ్యానించిన నెటిజన్లు.. ఆ ఫుట్‌బాల్ దిగ్గజంతో ఏఐ సాయంతో చిత్రాలను రూపొందించారు. ‘మెస్సీనే మా వద్దకు వచ్చారు’ అనే అర్థం వచ్చేలా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి, ఆ పోస్టులను వైరల్ చేశారు.
ఇంట్లో బిర్యానీ తినిపించినట్లు.. చాయ్ తాగుతున్నట్లు..
ఉప్పల్ స్టేడియంలలో క్రీడాభిమానులు టీషర్టులు, రంగులతో ఫొటోలు దిగి పోస్ట్ చేయడం మామూలే. కానీ, మెస్సీ సెల్ఫీకి రూ. 10 లక్షల అంశం తెరపైకి రావడంతో ఏఐ చిత్రాలు అంతకు మించి హల్చల్ చేశాయి. కొందరు నెటిజన్లు మెస్సీని తమ గ్యాలరీలోకి వచ్చి ఫొటో దిగినట్లు సృష్టించగా.. మహిళలు, యువతులు ఒక అడుగు ముందుకేసి మెస్సీని తమ ఇళ్లలోని హాలు, వంటిళ్లలోకి తీసుకెళ్లిపోయారు. ఆయనకు బిర్యానీ, పులిహోర తినిపిస్తున్నట్లు, వండిస్తున్నట్లుగా కూడా ఫేక్ ఏఐ ఫొటోలు సృష్టించి పోస్ట్ చేశారు. ఇక, మెస్సీ–సీఎం రేవంత్‌రెడ్డి జట్ల మధ్య కేవలం 50 మందితో జరిగిన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని, లక్షలాది మంది నెటిజన్లు మెస్సీతో కలిసి ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్ చివరకు కబడ్డీ కూడా ఆడినట్లుగా ఏఐ చిత్రాలను సృష్టించారు. చార్మినార్, గోల్కొండ, ఫలక్‌నుమా ప్యాలెస్‌ల వద్ద మెస్సీతో కలిసి హైదరాబాద్ చాయ్ తాగుతున్నట్లు, ఆయనే ఫాస్ట్‌ఫుడ్ తయారుచేస్తున్నట్లు ఏఐ ఫొటోలను సృష్టించి నెటిజన్లు పోస్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా.. ఈ ఏఐ చిత్రాలను వైరల్ చేసిన వారిలో సాధారణ ప్రజలతో పాటు కొంతమంది ప్రముఖులు, నాయకులు, యాంకర్లు కూడా ఉండటం గమనార్హం.






