BRS: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. కారణమిదే
కరీంనగర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను ఉద్దేశించి మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఆయనపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 126 (2), 132, 196, 299 మరియు ఇతర ముఖ్యమైన సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.
అసలేం జరిగిందంటే?
గురువారం వీణవంకలో జరిగిన స్థానిక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. అయితే, జాతర నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు పరిమిత వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యే తీవ్ర వాగ్వాదానికి దిగారు. కారు దిగి జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించడమే కాకుండా, కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై వ్యక్తిగత, మతపరమైన దూషణలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులకు హెచ్చరికలు
“రాబోయేది మన ప్రభుత్వమే, అప్పుడు మీ సంగతి చూస్తా” అంటూ విధుల్లో ఉన్న పోలీసులను కౌశిక్ రెడ్డి బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ఒక దశలో పోలీసులు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట కూడా జరిగింది. చివరకు నాలుగు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతించడంతో ఆయన జాతర ప్రాంతానికి చేరుకున్నారు.
వీణవంక జాతరలో హైడ్రామా
జాతర వద్దకు చేరుకున్న తర్వాత కూడా వివాదం సద్దుమణగలేదు. అక్కడ దళిత మహిళా సర్పంచ్ చేత కొబ్బరికాయ కొట్టించాలంటూ ఎమ్మెల్యే పట్టుబట్టారు. మరోవైపు, జాతర ట్రస్టీ వర్గానికి, ఎమ్మెల్యే వర్గానికి మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఘర్షణ జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు, ఎమ్మెల్యేను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఆయన వినకపోవడంతో పోలీసులు బలవంతంగా ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించివేశారు. పోలీసులపై దౌర్జన్యం చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి తీవ్రమైన అభియోగాలను కౌశిక్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది.






