Medaram: ప్రపంచ గిరిజన మహాకుంభమేళా మేడారం.. ఆత్మాభిమానం కోసం కాకతీయులతో సాగించిన వీరపోరాట చరిత్ర!
మేడారం: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. అది అడవి బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా జాతరలో కోట్లాది మంది భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటారు. ఎటువంటి విగ్రహాలు, మంత్రతంత్రాలు లేని ఈ జాతర పూర్తిగా ప్రకృతి ఆరాధనపై ఆధారపడి సాగడం దీని ప్రత్యేకత.
వీరమరణం.. దేవతారాధన
మేడారం జాతర వెనుక ఒక గొప్ప వీరగాథ దాగి ఉంది. కాకతీయ సామ్రాజ్య విస్తరణను అడ్డుకుంటూ, తమ ఆత్మాభిమానం కోసం పోరాడి వీరమరణం పొందిన గిరిజన నాయకులే నేడు దేవతలుగా కొలవబడుతున్నారు. జానపద కథల ప్రకారం, కరువు కాలంలో కూడా కాకతీయ చక్రవర్తులకు కప్పం కట్టలేమని ఎదిరించిన పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, జంపన్నలు అడవి బిడ్డల కోసం ప్రాణత్యాగం చేశారు.
యుద్ధానికి అసలు కారణం ఏంటి?
చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం, కేవలం కప్పం కట్టకపోవడమే ఈ యుద్ధానికి కారణం కాదు. కాకతీయ రుద్రదేవుని (క్రీ.శ. 1158-1195) కాలంలో ఈ సంఘర్షణ జరిగి ఉండవచ్చు. రాజ్య విస్తరణ కాంక్షతో ఉన్న రుద్రదేవుడు, తనకు లొంగని మేడరాజును అప్పగించాలని పగిడిద్దరాజుపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి అంగీకరించని గిరిజన వీరులపై రుద్రదేవుని సేనాధిపతి గంగాధర మంత్రి దాడి చేశాడు. జంపన్న వాగు ఒడ్డున జరిగిన ఈ భీకర పోరాటంలో కోయ సైన్యం వీరోచితంగా పోరాడి నేలకొరిగింది. ఆ రక్తపు ధారలతోనే వాగు ఎర్రగా మారిందని, అందుకే దానికి ‘జంపన్న వాగు’ అనే పేరు వచ్చిందని నమ్ముతారు.
గుడి లేని దైవం.. ప్రకృతి పూజ
గిరిజన సంస్కృతిలో నాయకులను అర్ధదేవతలుగా పూజించడం అనాదిగా వస్తోంది. మేడారంలో ఎలాంటి గుళ్లు, గోపురాలు ఉండవు. వెదురు కర్రలు, కుంకుమ భరిణెలను గద్దెలపై ప్రతిష్టించి వాటినే అమ్మవార్లుగా భావిస్తారు. కోయలు దేవుడిని ‘వేల్పులు’ అని పిలుస్తారు. ప్రకృతిని, చెట్లను, గుట్టలను దైవ స్వరూపాలుగా ఆరాధించే గిరిజన ఆచారం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
చారిత్రక ఆధారాలు
ఇటీవలి పరిశోధనల ప్రకారం, సమ్మక్క తల్లి చంద్రాపూర్ రాజధానిగా పాలించిన రాచగోండుల వంశానికి చెందిన స్త్రీ అని తెలుస్తోంది. శాసనాల ప్రకారం చూస్తే, కాకతీయ సైన్యం ముందర గిరిజన సైన్యం నిలవలేకపోయినప్పటికీ, వారి పోరాట పటిమ అజరామరంగా నిలిచిపోయింది. మేడరాజు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్కల పేర్ల మీద వెలిసిన గద్దెలే నేడు కోట్లాది మందికి ఆధ్యాత్మిక భరోసాను ఇస్తున్నాయి. మేడారం జాతర గిరిజన జాతి అస్తిత్వానికి గుర్తు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం, అడవి బిడ్డల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెబుతోంది. ఈ జాతరలో భక్తులు సమర్పించే ‘బంగారం’ (బెల్లం) వారి భక్తికి చిహ్నం. ఈ ఏడాది కూడా మేడారం జాతర భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.






