YCP: వైసీపీకి ఉప ఎన్నికల సవాల్?.. కూటమి వ్యూహాలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠతో సాగుతున్నాయి. అధికార కూటమి ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి (YCP) మధ్య పోరు రోజురోజుకూ మరింత కఠినంగా మారుతోంది. గత దాదాపు ఇరవై నెలలుగా రాష్ట్ర అసెంబ్లీకి వైసీపీ సభ్యులు హాజరు కావడం లేదు. దీనిని అధికార పార్టీలు ఒక రకమైన అసెంబ్లీ బహిష్కరణగా అభివర్ణిస్తున్నాయి. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఒకవైపు వైసీపీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా, మరోవైపు సభకు రాని పార్టీకి ఆ హక్కు ఎలా ఇస్తారని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
నిబంధనల ప్రకారం అసెంబ్లీ సభ్యుడు అరవై పని దినాలు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. ఈ సమావేశాలతో అరవై పని దినాల సంఖ్య పూర్తవుతుందని, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), జనసేన పార్టీ (Jana Sena Party), బీజేపీ (Bharatiya Janata Party) కలిసిన కూటమి దీనిపై గట్టిగా ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హులైతే ఉప ఎన్నికలు తప్పవు. చట్టప్రకారం ఆరు నెలల లోపు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటికి కూటమి ప్రభుత్వం దాదాపు రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసిన దశలో ఉంటుంది. సాధారణంగా ఈ కాలంలో కొంత మేర యాంటీ ఇన్‌కంబెన్సీ ప్రభావం కనిపించే అవకాశముంటుంది. అయినప్పటికీ అధికార బలం, ప్రభుత్వ వనరులు కూటమికి పెద్ద అడ్వాంటేజ్‌గా మారతాయని అంచనాలు ఉన్నాయి.
మరోవైపు వైసీపీ (YSR Congress Party) పరిస్థితి అంత సులభంగా కనిపించడం లేదు. ఉప ఎన్నికలు వస్తే పార్టీ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది. పైగా “ఒకసారి గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలను విస్మరించారు” అనే విమర్శలు ప్రచారంలో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. ఈ అంశాన్ని కూటమి జనంలోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఉప ఎన్నికల్లో అధికార పక్షానికే పైచేయి ఉంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వైసీపీ కూడా ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లో పార్టీకి ఎంతవరకు మద్దతు ఉంటుందనే అంశంపై అంతర్గతంగా సర్వేలు చేయించిందనే ప్రచారం ఉంది. ఆ సర్వేల్లో గతంలో ఉన్న అన్ని స్థానాలు తిరిగి దక్కే పరిస్థితి లేదన్న అంచనాలు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గితే అది పార్టీకి దీర్ఘకాలికంగా పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది.
ఈ మొత్తం పరిణామాల మధ్య, కొందరు సీనియర్ రాజకీయ నాయకులు ఒక సూచన చేస్తున్నారు. రాజకీయ భేషజాలను పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చ చేయడమే వైసీపీకి ఉత్తమ మార్గమని వారు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తేనే కూటమి ఎత్తులకు సరైన ప్రత్యుత్తరం ఇవ్వగలుగుతుందని అంటున్నారు. లేకపోతే ఉప ఎన్నికలు జరిగితే కూటమికి నష్టమేమీ లేకుండా, వైసీపీకి మాత్రం ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.






