Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రాలేనన్న గులాబీ బాస్!
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో విచారణకు రావాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అధికారులు ఈ నోటీసులు అందజేశారు. జనవరి 30 మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ కార్యాలయానికి రావాలని, లేదా వీలుకాకుంటే అధికారులే ఆయన సూచించిన ప్రాంతానికి వస్తారని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కారణంగా తాను విచారణకు రాలేనని కేసీఆర్ బదులిచ్చారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు ఉన్నందున మరో తేదీని ఖరారు చేయాలని కోరారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిని పోలీసు స్టేషన్‌కు పిలవకూడదని, అందుకే సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వచ్చి తనను విచారించవచ్చని సూచించారు. భవిష్యత్తులో ఏవైనా సమాచార మార్పిడి ఉంటే ఎర్రవల్లి చిరునామాకే పంపాలని స్పష్టం చేశారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కేసీఆర్ ఇచ్చిన వివరణపై సిట్ చీఫ్ సజ్జనార్ స్పందిస్తూ, దీనిపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సాధారణంగా కేసుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుందని, అందుకే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.






