Viral: రూ.26 వేలకే అదిరిపోయే కారు.. చివర్లో భారీ ట్విస్ట్
మేడ్చల్: సోషల్ మీడియాలో వచ్చే తక్కువ ధర ప్రకటనలను నమ్మి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి మల్లాపూర్‌లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. కేవలం రూ.26వేలకే కారు అమ్ముతానని పాత కార్ల వ్యాపారి రోషన్ చేసిన ప్రకటన చివరకు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అసలేం జరిగిందంటే..
మల్లాపూర్‌కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి, తన వద్ద ఉన్న కార్లను అతి తక్కువ ధరకే అంటే రూ. 26 వేలకే ఇస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఈ ప్రకటన చూసిన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తెల్లవారుజామునే అతని షోరూమ్‌కు చేరుకున్నారు. అయితే, తీరా అక్కడికి వెళ్ళాక అలాంటి కార్లేవీ లేవని వ్యాపారి చెప్పడంతో వచ్చిన వారంతా అవాక్కయ్యారు. తమను మోసం చేశాడని ఆగ్రహించిన స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అక్కడ పార్క్ చేసి ఉన్న ఇతర కార్లపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. దీనితో ఆ ప్రాంతంలో కాసేపు యుద్ధ వాతావరణం నెలకొంది.
పోలీసుల రంగప్రవేశం..
సమాచారం అందుకున్న నాచారం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించి, ఉద్రిక్తతకు కారణమైన వ్యాపారి రోషన్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.






