Republic Day: హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా రైజింగ్ డాక్యుమెంట్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) అన్నారు. గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించింది. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా దీన్ని రూపొందించింది. ఈ డాక్యుమెంట్ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్రాన్ని మూడు ఎకానమీ జోన్లుగా ప్రభుత్వం విభజించింది. మూడు కీలక రంగాల కోసం దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. మేడారం అభివద్ధి కోసం రూ.251 కోట్లు కేటాయించాం. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గతేడాది నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది. 26 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. సన్న వడ్లపై క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నాం. దాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780 కోట్లు చెల్లించాం. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. భూ వివాదాలు పరిష్కరించేలా భూభారతి చట్టం తీసుకొచ్చాం. గ్రూప్-1, 2, 3 ఉద్యోగాల భర్తీని పూర్తి చేశాం. ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు 62 వేల ఉద్యోగాలు కల్పించింది అని అన్నారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






