Veligonda: వెలిగొండ ‘క్రెడిట్’ ఎవరిది..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ‘క్రెడిట్ వార్’ తారాస్థాయికి చేరింది. దశాబ్దాలుగా నలుగుతున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఇప్పుడు అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రాంతాల తలరాతను మార్చే ఈ ప్రాజెక్టును తామే పూర్తి చేశామని ఒకరు.. కాదు తామే పునాది వేసి పరుగులు పెట్టించామని మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ ప్రాజెక్టుకు నిధుల ప్రవాహం పెరిగింది. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో చేర్చి, సుమారు రూ. 3,610 కోట్లను వెచ్చించారు. ప్రధాన కాలువలు, హెడ్ రెగ్యులేటర్ పనులను వైఎస్సార్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆ తర్వాత 2014-19 మధ్య చంద్రబాబు టన్నెల్ బోరింగ్ మెషీన్లను (TBM) రంగంలోకి దించి, అత్యంత క్లిష్టమైన మొదటి టన్నెల్ పనులను 90శాతం పూర్తి చేశారు. 2019-24 మధ్య జగన్ రెండో టన్నెల్ తవ్వకాన్ని పూర్తి చేసి, ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించుకోవడంతో రాజకీయం రాజుకుంది. “మేము వేల కోట్లు ఖర్చు చేసి టన్నెల్ పనులను పూర్తి చేస్తే, ఇప్పుడు చంద్రబాబు వెళ్లి ఆ క్రెడిట్‌ను దొంగిలించాలని చూస్తున్నారు” అని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తయిందని వారు వాదిస్తున్నారు.
అయితే, టీడీపీ ఈ వాదనను బలంగా తిప్పికొడుతోంది. కేవలం టన్నెల్ తవ్వకం పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తి అయినట్లా అని ప్రశ్నిస్తోంది. ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి పునరావాసం పనులను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎద్దేవా చేస్తోంది. ఇంకా 7,500 పైచిలుకు కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉంది. కాలువల లైనింగ్, వంతెనల నిర్మాణం లాంటి కీలక పనులు పెండింగ్‌లో ఉండగానే జగన్ కేవలం ఓట్ల కోసం రిబ్బన్ కట్ చేశారని టీడీపీ మండిపడుతోంది. దాదాపు రూ. 9,000 కోట్ల మొత్తం ప్రాజెక్టు వ్యయంలో వైసీపీ చేసింది కేవలం రూ. వెయ్యి కోట్ల పనులేనని, మిగిలిన 80 శాతం శ్రమ ఇతర ప్రభుత్వాలదేనని వారు గణాంకాలు వివరిస్తున్నారు.
ప్రస్తుతానికి వెలిగొండ ప్రాజెక్టులో రెండు టన్నెళ్ల తవ్వకం పూర్తయిన మాట వాస్తవం. కానీ, సాంకేతికంగా చూస్తే టన్నెల్-2 లో లైనింగ్ పనులు, ఫీడర్ కెనాల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. అన్నింటికంటే ముఖ్యంగా, రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నింపాలంటే 11 ముంపు గ్రామాల్లోని ప్రజలకు సుమారు రూ. 1,400 కోట్లు చెల్లించి పునరావాసం కల్పించాల్సి ఉంది. ఈ పనులు పూర్తి కాకుండా రైతు పొలాలకు చుక్క నీరు కూడా చేరదు.
రాజకీయ పార్టీల వాదనలు ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం “నీరు ఎవరి హయాంలో వస్తుంది?” అన్నదే కొలమానంగా చూస్తున్నారు. తవ్వకాలు ఒక ప్రభుత్వం చేస్తే, నిధులు మరొకరు ఇచ్చారు. కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 2026 జూన్ నాటికి మిగిలిన రూ. 3,000 కోట్ల పనులను పూర్తి చేసి, నిర్వాసితులకు న్యాయం చేసి నీటిని విడుదల చేస్తే.. అంతిమంగా ప్రజల దృష్టిలో వారికే క్రెడిట్ దక్కే అవకాశం ఉంది. ఈ లోపు ఈ క్రెడిట్ వార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని సెగలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.






