Rajendra Prasad: నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం నా అదృష్టం, నా తెలుగు ప్రజల ఆశీర్వాదం – రాజేంద్ర ప్రసాద్
భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల పేర్లు విడుదల చేయడం జరిగింది. వారిలో ఒకరు మన తెలుగువారు నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు ఉండటం మనందరికీ గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నుండి తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి 1977లో స్నేహం అనే చిత్రంతో మొదలుకొని నేటి వరకు ఎన్నో చిత్రాలలో పాత్రలో పోషిస్తూ తనదైన గుర్తింపు పొందారు. తనకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఈ విధంగా రాజేంద్రప్రసాద్ గారు స్పందించారు.
“నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది అని తెలిసినప్పటినుండి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడి గానే కాకుండా, మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకటిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించిన, ఏడిపించిన, మా రాజేంద్రప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ వరకు నడిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నన్ను సొంత బిడ్డ లాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతోపాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలను అందుకుంటున్న దేశంలోని మహానుభావులు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నామీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు సర్వదా, మీ రాజేంద్రప్రసాద్.” అంటూ ముగించారు.






