Vijayasai Reddy: విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. ‘పాదయాత్ర’కు చురుగ్గా ఏర్పాట్లు..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాణక్యుడుగా పేరుగాంచిన విజయసాయి రెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2గా చక్రం తిప్పి, అనూహ్య పరిణామాల మధ్య ఆ పార్టీని వీడిన ఆయన, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానన్న ఆయన, ఇప్పుడు రూటు మార్చి మళ్లీ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతుండటం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
2024 ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో వచ్చిన మార్పులు, అధినేత జగన్ మోహన్ రెడ్డితో పెరిగిన దూరం విజయసాయి రెడ్డిని తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేశాయి. అప్పట్లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన, రాజకీయాలు తనకు ముగిసిన అధ్యాయమని ప్రకటించారు. అయితే, ఇటీవల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈడీ ఎదుట హాజరైన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. “జూన్ తర్వాత రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతాను.. మరిన్ని వివరాల కోసం ఈ నెలాఖరు వరకు వేచి ఉండండి” అని ఆయన చెప్పడం ద్వారా తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.
విజయసాయి రెడ్డి మళ్లీ వస్తున్నారంటే అది ఏ పార్టీ నుంచి అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన ఘాటు విమర్శల నేపథ్యంలో ఈ కూటమిలో ఆయనకు చోటు దక్కడం అసాధ్యం. జగన్ తో ఉన్న విభేదాలు, పార్టీలోని ‘కోటరీ’ వ్యవహారాల వల్ల మళ్లీ సొంత గూటికి చేరే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్రనేతలతో విజయసాయికి ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆయన కమలం తీర్థం పుచ్చుకుంటారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
కానీ, తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలుస్తోంది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, బలాన్ని నిరూపించుకున్న తర్వాతే పార్టీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేయాలంటే ప్రజల్లోకి వెళ్లడమే ఏకైక మార్గమని విజయసాయి రెడ్డి విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది. తన రాజకీయ గురువులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇద్దరూ పాదయాత్రల ద్వారానే అధికార పీఠాన్ని అధిష్టించారు. అదే ఫార్ములాను ఇప్పుడు విజయసాయి కూడా ఎంచుకున్నట్లు సమాచారం. జూన్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలనేది ఆయన మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది.
పాదయాత్ర వెనుక విజయసాయి రెడ్డికి కొన్ని లక్ష్యాలున్నాయి. ప్రజల నాడిని పట్టుకోవడం ఇందులో ముఖ్యమైనది. క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై, వైసీపీపై ఏ అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకోవాలని సాయిరెడ్డి భావిస్తున్నారట. ఏ పార్టీ అండ లేకుండా తానూ జనాన్ని ప్రభావితం చేయగలనని చాటి చెప్పడం కూడా పాదయాత్ర వెనుక మరో ఉద్దేశం. పాదయాత్రలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొత్త పార్టీ పెట్టాలా లేక బీజేపీ వంటి జాతీయ పార్టీలో చేరాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెప్తున్న మాట.
విజయసాయి రెడ్డి పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన సొంతంగా పార్టీ పెడితే, అది వైసీపీ ఓటు బ్యాంకును చీల్చుతుందా? లేక కూటమి వ్యతిరేక ఓటును ఆకర్షిస్తుందా? అనేది ఆసక్తికరం. లిక్కర్ స్కామ్ వంటి కేసుల నీడలో ఆయన చేస్తున్న ఈ ప్రయాణం కేవలం రాజకీయ అస్తిత్వం కోసమేనా లేక చట్టపరమైన ఇబ్బందుల నుంచి రక్షణ కోసమా అనే కోణంలోనూ విశ్లేషణలు సాగుతున్నాయి.
మొత్తానికి, వ్యవసాయం నుంచి మళ్లీ రాజకీయ వ్యవహారాల వైపు మళ్లుతున్న విజయసాయి రెడ్డి, జూన్ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి. పాదయాత్ర ఆయనకు రాజమార్గం అవుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.






