Pakistan: మరో ట్విస్ట్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
టి20 వరల్డ్ కప్(T20 World Cup) లో పాకిస్తాన్ ఆడుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టంగానే ఉంది. బంగ్లాదేశ్ తప్పుకున్న తర్వాత పాకిస్తాన్ కూడా భారత్ పై కోపంతో తప్పుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నక్వీ కూడా దీనిపై హడావుడి చేసారు. నిన్న జట్టుని ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆడటంపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రకటించినంత మాత్రాన ఆడతాము అనేది చెప్పలేం అంటూ వ్యాఖ్యలు చేసాడు. ప్రభుత్వ అనుమతి కావాల్సిందే అంటూ కామెంట్ చేసాడు.
ఇక ఇప్పుడు మరో కీలక వార్త వైరల్ గా మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో సమావేశం అయిన తర్వాత కూడా క్లారిటీ ఇవ్వలేదు. పాకిస్తాన్ ప్రధానితో సమావేశమైన తర్వాత, ఈ విషయంపై ఇంకా చర్చించాల్సి ఉందన్నాడు. అలాగే అన్ని విషయాలు చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం అన్నాడు. శుక్రవారం లేదా వచ్చే సోమవారం నాటికి దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
ఐసిసి నిర్ణయాల గురించి ప్రధానికి వివరించినట్లు తెలిపాడు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించినట్లు చెప్పుకొచ్చాడు. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ తప్పుకున్న తర్వాత ఐసీసీ కూడా కఠినంగానే వ్యవహరించింది. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ కూడా తప్పుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఒకవేళ పాకిస్తాన్ ఆడకపోతే మాత్రం.. భవిష్యత్తులో మెగా టోర్నీలలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లు చూడటం కష్టమే.






