Dhaka: బంగ్లాదేశ్ లో మరో ఘోరం.. పథకం ప్రకారమే హిందువుల హత్యలు..!
మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ సర్కార్ లో మైనార్టీలపై దాడులు, దురాగతాలు తీవ్రరూపు దాల్చాయి. ఇప్పటికే పలువురు హిందువులను మట్టుపెడుతున్న మతదురహంకారులు.. శుక్రవారం మరో హిందువును దారుణంగా హత్య చేశారు. నిద్రలో ఉన్న హిందూ యువకుడిని సజీవదహనం చేశారు.దీంతో ఆ కుటుంబం రోదనలతో .. ఆప్రాంతం మార్మోగింది.
బంగ్లాదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ హిందూ యువకుడిని దుండగులు సజీవ దహనం చేశారు. శుక్రవారం రాత్రి నార్సింగ్డి ప్రాంతంలోని ఓ షాపులో చంచల్ భౌమిక్ (23) అనే యువకుడు నిద్రిస్తుండగా దుండగులు దాడి చేశారు. షాపు షట్టర్ మూసేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల వేడికి నిద్రలో నుంచి లేచిన చంచల్ బయటపడేందుకు విఫలయత్నం చేశాడు. చంచల్ మంటల్లో కాలి చనిపోయాడని నిర్ధారించుకున్నాకే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.
కుటుంబానికి చంచలే ఆధారం..
చంచల్ భౌమిక్ తండ్రి చాలాకాలం క్రితమే చనిపోయాడు. తల్లితో పాటు ఇద్దరు సోదరులను చంచల్ తన కష్టంతో పోషిస్తున్నాడు. ఇందుకోసం నార్సింగ్డి ప్రాంతంలోని గ్యారేజీలో చంచల్ ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. కాగా, చంచల్ ను దుండగులు పథకం ప్రకారమే చంపేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి ఉన్న ఒక్క ఆధారం కూడా పోయిందని చంచల్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.






