Snow Storm: అమెరికాపై మంచు తుపాను పంజా.. వణుకుతున్న పలు రాష్ట్రాలు..!
అగ్రరాజ్యం అమెరికా (USA)ను భారీ మంచు తుపాను (Winter Storm ) వణికిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీస్థాయిలో మంచు వర్షం కురుస్తోంది. వర్షంతోపాటు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం టెక్సాస్, ఓక్లహోమాపై మంచు తుపాను పంజా విసురుతోంది. ఈ భీకర తుపాను (Monster winter storm) కారణంగా పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది.
శనివారం నాడు 3,200 విమాన సర్వీసులు, ఆదివారం నాడు 4,800 విమాన సర్వీసులు రద్దయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ వెల్లడించింది. మున్ముందు ఈ పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉండడంతో పెద్దసంఖ్యలో రవాణా సర్వీసులకు అంతరాయం కలగొచ్చని అంచనా వేసింది. మంచు తుపాను కారణంగా అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ..
వాతావరణ హెచ్చరికలతో అమెరికాలోని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీ విధించాయి. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రమాదకర చలి వాతావరణం ఉంటుందని.. మిస్సోరి, ఇల్లినోయీలలోనూ భారీ మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రతికూల వాతావరణం కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని, వాహనదారులు మంచులోనే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఈ దశాబ్దిలోనే అతి తీవ్రమైనదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.






