Volunteers: రాజకీయ లెక్కల్లో తేలిపోయిన జగన్ మానస పుత్రిక..పునరాగమనం కష్టమే..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ప్రధాన పాలనా ప్రయోగాల్లో గ్రామ వార్డు సచివాలయ (Sachivalayam) వ్యవస్థ ఒకటి. దానితో పాటు రెండు లక్షల డెబ్బై వేల మందికి పైగా వాలంటీర్ల వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఈ వ్యవస్థను.. పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసే మార్గంగా వివరించారు. ప్రతి వాలంటీర్‌కు (Volunteer) నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇచ్చి, యాభై కుటుంబాలకు బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా వాలంటీర్లు రాజకీయంగానూ పార్టీకి ఉపయోగపడతారన్న అంచనాతో వైసీపీ (YCP) ముందుకెళ్లింది.
కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఈ వ్యూహం పూర్తిగా తిరగబడింది. వాలంటీర్లపై పూర్తిగా ఆధారపడడంతో పార్టీ నాయకులు, సంప్రదాయ క్యాడర్ క్రమంగా పక్కన పడిపోయారు. అంతా వాలంటీర్లే చూసుకుంటారన్న ధీమాతో పార్టీ యంత్రాంగం బలహీనమైంది. ఎన్నికల సమయంలో భారత ఎన్నికల సంఘం (Election Commission of India) తీసుకున్న నిర్ణయాలతో వాలంటీర్లు ప్రచారానికి దూరమయ్యారు. ఇదే సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు వాలంటీర్లలో గందరగోళం సృష్టించాయి.
కూటమి ప్రభుత్వం (NDA Alliance) అధికారంలోకి వస్తే పది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన హామీ వాలంటీర్లను ఆకర్షించింది. చాలా మంది వైసీపీకి దూరంగా ఉండిపోయారు. ఫలితంగా పార్టీ వ్యూహం రెండింతల నష్టంగా మారి, 2024 ఎన్నికల్లో వైసీపీ ఎన్నడూ లేని పరాజయాన్ని ఎదుర్కొంది. ఒకప్పుడు పార్టీకి బలంగా భావించిన వ్యవస్థే చివరకు బూమరాంగ్ అయిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపించింది.
ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం కొద్దికాలం వాలంటీర్ల ఆందోళనలను ఎదుర్కొంది. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే వాలంటీర్ల సేవలను 2023 ఆగస్టు నుంచే అప్పటి ప్రభుత్వం పునరుద్ధరించలేదన్న సాంకేతిక కారణాలు చూపిస్తూ వారిని పక్కన పెట్టారు. అదే సమయంలో సామాజిక పెన్షన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగుల ద్వారానే కొనసాగించారు. దీంతో ప్రజలకు సేవల్లో ఎలాంటి లోటు లేదన్న భావన ఏర్పడింది, వాలంటీర్ల అంశం క్రమంగా మరుగున పడింది.
వాలంటీర్ల వ్యవస్థను తమ మానస పుత్రికగా చెప్పుకున్న వైసీపీ, ఎన్నికల తర్వాత మాత్రం వారి గురించి పెద్దగా మాట్లాడటం లేదు. గతంలో జరిగిన ఆందోళనలను ప్రభుత్వంపై విమర్శలుగా ఉపయోగించుకున్నా, అధికారంలోకి వస్తే వాలంటీర్లను తిరిగి తీసుకుంటామని స్పష్టంగా చెప్పలేదు. ఇది పార్టీ వ్యూహాత్మక మౌనం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువస్తారా అన్న ప్రశ్నకు పార్టీ నేతలు స్పష్టంగా లేదనే సమాధానం ఇస్తున్నారు. ఈసారి క్యాడర్‌కే పూర్తి ప్రాధాన్యం ఉంటుందని, వారే ప్రభుత్వానికి ముఖంగా ఉంటారని భరోసా ఇస్తున్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన వాలంటీర్ల వ్యవస్థ చివరికి రాజకీయంగా తీరని నష్టం చేసిందన్న అంగీకారం వైసీపీ మాటల్లోనే కనిపిస్తోంది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద పాలనా సంస్కరణగా చెప్పుకున్న వ్యవస్థను ఇప్పుడు ప్రస్తావించడానికే పార్టీ వెనకడుగు వేస్తుండటం రాజకీయంగా గట్టిదెబ్బ తగిలిన సంకేతంగా చర్చకు వస్తోంది.






