H1B Visa: హెచ్-1బీ వీసా దరఖాస్తు దారులకు అమెరికా మరో షాక్.. !
అమెరికాలో హెచ్-1 బీ వీసా దరఖాస్తు దారులకు మరో విషమ సమస్య ఎదురైంది. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు ఇంటర్వ్యూలకు విరామం ప్రకటించిన అమెరికా.. ఇప్పుడు దాన్ని 2027లోకి మార్చింది. దీంతో భారతీయ వృత్తి నిపుణులకు అమెరికా (USA) ప్రయాణాల్లో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. హెచ్-1బీ (H-1B visa) వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027లోకి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వేలాది మంది వృత్తి నిపుణులు భారత్‌లోనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తింది.
భారత్‌లోని అమెరికా (USA) కాన్సులేట్లలో బ్యాక్‌లాగ్‌లు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027లోకి మారాయి. వాస్తవానికి డిసెంబర్ 2025లో వీటిల్లో తొలిసారి జాప్యం చోటుచేసుకొంది. నాడు ఇంటర్వ్యూలను మార్చి 2026కు మార్చాల్సివచ్చింది. ఆ తర్వాత ఆ తేదీలు అక్టోబర్‌కు.. ఇప్పుడు 2027కు మారినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు లేవు. దీంతో ప్రస్తుతం ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలలు తర్వాతకు మార్చాల్సి వచ్చింది. ఫలితంగా 2027 సంవత్సరం మధ్యలోకి అవి చేరాయి.
అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్‌కు వెళ్లవద్దని సూచిస్తున్నారు ఇమ్మిగ్రేషన్ నిపుణులు. హ్యూస్టన్‌కు చెందిన ఇమిగ్రేషన్ సంస్థ భాగస్వామి ఎమిలీ న్యూమన్ మాట్లాడుతూ.. తాము గత 50 రోజుల్లో భారత్ కోసం కొత్త వీసా ఇంటర్వ్యూల స్లాట్లు ఉన్నట్లు చూడలేదన్నారు. అదే సమయంలో అమెరికాలో ఉన్న వృత్తి నిపుణలు కూడా భారత్‌లో స్టాంపింగ్ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నించడంలేదని చెప్పారు. 2027 వరకు ఎటువంటి రెగ్యులర్ అపాయింట్మెంట్లు లేవని ‘అమెరికన్ బజార్’ వెల్లడించింది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన వారికి కూడా ఇంటర్వ్యూలు రద్దైనట్లు చెప్పారని తెలిపింది.
జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్న వారికి కూడా.. వాటిలో మార్పులు చేసి ఏడాది తర్వాత డేట్లను కేటాయిస్తూ ఈమెయిల్స్ వచ్చాయి. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు చేరుకొన్న వేలాది మంది వృత్తి నిపుణులు తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. వీరిలో కొందరి భార్యపిల్లలు అమెరికాలో ఉండగా.. తల్లిదండ్రులు భారత్‌లో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టులు, హౌసింగ్ అగ్రిమెంట్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. వీసా గడువు ముగిసిన చాలా మంది ఉద్యోగులకు .. వారి సంస్థల యజమానులు పొడిగింపులను కూడా ఇవ్వడంలేదు. దీనికి తోడు లక్ష డాలర్ల ఫీజు ఉండటంతో కొత్త హెచ్-1బీ వీసాల కోసం కంపెనీలు దరఖాస్తులు చేయడంలేదు.
మరోవైపు ఈ సమస్యను మరింత జఠిలం చేసేలా అమెరికా విదేశాంగ శాఖ కొన్నాళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకొంది. దీని ప్రకారం భారతీయులు మరో దేశంలోని అమెరికా కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చేయించుకునే అవకాశాన్ని నిలిపివేసింది. దీంతో భారతీయ కాన్సులేట్లలో అపాయింట్మెంట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.






