Khameni: ఢిల్లీ-టెహ్రాన్ భాయీ భాయీ…. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ..!
ఇరాన్ విషయంలో ఇండియా వైఖరి మారుతోందా..? ముఖ్యంగా పాత, చిరకాల మిత్రదేశాలతో బంధాలను ఇండియా మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోందా..? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినవస్తోంది. ఎందుకంటే.. మొన్నటివరకూ అమెరికాపై విపరీతంగా ఆధారపడిన భారత్.. ఇప్పుడు తన విధానంలో మార్పు కనబరుస్తోంది. యూరప్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుదిదశలో ఉంది. ఇరాన్ తో తన సంబంధాలను కొనసాగిస్తోంది. యూఏఈతో వాణిజ్య బంధాన్ని కొత్తపుంతలు తొక్కిస్తోంది.
దీనిలో భాగంగా లేటెస్టుగా ఇరాన్ లో ఆందోళనలను విమర్శిస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి అత్యవసర సమావేశంలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ పరిణామంపై భారత్‌లోని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఫ్రాన్స్, మెక్సికో, దక్షిణ కొరియా వంటి 25 దేశాలు ఓటింగ్‌కు మద్దతు పలుకగా.. భారత్, చైనా సహా ఏడు దేశాలు వ్యతిరేకించాయి. మరో 14 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
భారత్-ఇరాన్‌ల మధ్య బంధం వందల ఏళ్ల నాటిదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భారత ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ పేర్కొన్నారు. భారత్ భాగస్వామిగా ఉన్న చాబహార్ పోర్టు పురోగతిపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇరాన్‌పై ఆంక్షలు విధించడమేకాకుండా అణు కేంద్రాలపై నిఘా పెట్టిన కొన్ని అంతర్జాతీయ సంస్థలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని అన్నారు. భారత్‌కు చెందిన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.
‘‘భారత్-ఇరాన్ మధ్య మంచి సంబంధాలు, సహకారం ఉండాలని సుప్రీం లీడర్ కోరుకుంటున్నారు. ఇతర దేశాల ఆంక్షల వల్ల భారత్ ఎప్పుడూ ప్రభావితం కాలేదు. చాబహార్ పోర్టులో బాగా పనిచేస్తారని ఆశిస్తున్నా. ఇరు దేశాల మధ్య సంబంధాలు మూడువేల ఏళ్ల నాటివి. ఆ సమయంలోనూ భారత్‌కు చెందిన తాత్విక పుస్తకాలు ఉపయోగించేవాళ్లం. ప్రస్తుతం మా విశ్వవిద్యాలయాల్లోనూ గణితం, ఖగోళశాస్త్రం, వైద్య విద్యను చదువుతున్నాం’’ అని హకీమ్ ఇలాహీ పేర్కొన్నారు.
మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు కీలకంగా ఉన్న చాబహార్ పోర్టులో భారత్ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఓడరేవులో 10ఏళ్ల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం భారత్-ఇరాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ.. ఈ పోర్టు విషయంలో మినహాయింపు ఇవ్వడంతో భారత్‌కు ఉపశమనం కలిగింది.






