Trump: భారత్ కు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్తారా..?
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్(India) వెనక్కు తగ్గకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్ విషయంలో కక్ష సాధింపుగా వ్యవహరిస్తోన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. పదే పదే సుంకాల పేరుతో భారత్ ను బెదిరించడమే కాకుండా ఏకంగా రెండు దఫాలుగా 50 శాతం సుంకాలను భారత్ కు విధించారు ట్రంప్. ఇటీవల మరోసారి ఈ సుంకాల విషయంలో బెదిరింపులకు దిగారు ట్రంప్. ఈ నేపధ్యంలో తాజాగా అమెరికా(America) సర్కార్ నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది.
భారత్ పై అమెరికా.. విధించిన 50 శాతం సుంకాలను సగానికి తగ్గించే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం పరిగణించవచ్చని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ సంకేతాలు ఇచ్చారు. ఇటీవలి కాలంలో రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేసే విషయంలో కాస్త వెనక్కు తగ్గుతుందని, కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా సానుకూల మార్పులు ఉండవచ్చు అన్నారు. అమెరికన్ వార్తా సంస్థ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెంట్ మాట్లాడుతూ, రష్యా చమురు దిగుమతులను తగ్గించాలనే ఒత్తిడికి భారత్ నుంచి అనుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు.
భారత వస్తువులపై విధించే కనీసం 25 శాతం సుంకాలను తగ్గించడానికి అనుకూలమైన పరిస్థితులను భారత్ సృష్టించిందని తెలిపారు. భారత్ నుంచి శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ముందుకు అడుగులు వేస్తున్న, యూరోపియన్ యూనియన్ చర్యలను మూర్ఖత్వంగా అభివర్ణించారు. భారత్ తో.. అతిపెద్ద వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలనుకుంటున్నందున.. భారత్ పై సుంకాలు విధించే ఆలోచనకు యూరోపియన్ యూనియన్ ముగింపు పలికిందని ఆయన పేర్కొన్నారు. గత వారం దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా.. ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ, ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్.. రష్యన్ చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించుకుందని బెసెంట్ వ్యాఖ్యానించారు.






