Shashi Tharoor: ఎవడికీ చెప్పాల్సిన అవసరం లేదన్న ఎంపీ..!
గత ఏడాది కాలంగా కాంగ్రెస్ కు దూరంగా బిజెపికి దగ్గరగా జరుగుతోన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో జరిగిన కీలకమైన కాంగ్రెస్ సమావేశానికి తాను హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు ఈ క్రేజీ ఎంపీ. ఈ మధ్య కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న ఈ నేత.. మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే తగినంతగా చర్చించామని, ఏవైనా ఆందోళనలు ఉంటే.. పార్టీ నాయకత్వం ముందే మాట్లాడటం జరుగుతుందని స్పష్టం చేసారు శశి తరూర్. కేరళ సాహిత్య ఉత్సవంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.
కేరళలోని తిరువనంతపురం నుండి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన.. పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉండేవారు. పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడటానికి బహిరంగ వేదికలను తాను ఉపయోగించనని స్పష్టం చేశారు. తాను ఏ విధమైన రాజకీయ ప్రకటనలు చేయడానికి ఇక్కడకు రాలేదు అంటూ కామెంట్ చేసారు. ఇది కేవలం సాహిత్య ఉత్సవం అన్నారు. తన సొంత పార్టీ నాయకత్వంతో చర్చించవలసిన విషయాలే గాని బహిరంగ వేదికలో కాదన్నారు. పార్లమెంటు సమావేశాల కోసం తాను ఢిల్లీకి వెళ్తున్నానని తెలిపారు.
అక్కడ పార్టీ నాయకత్వంతో సరైన, నిర్మాణాత్మక సంభాషణకు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తాను గత 17 సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉన్నానని, ఏదైనా తప్పు జరిగితే దాన్ని పరిష్కరించాలన్నారు. తాము ఆ సమస్యను తగిన వేదికపై పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశానికి హాజరు కాకపోవడంపై తన వైఖరిని తాను ఇప్పటికే స్పష్టం చేశానని, ఇకపై బహిరంగ వివరణ ఇవ్వబోనని థరూర్ స్పష్టం చేసారు. ఈ విషయాన్ని మీడియా తగినంతగా కవర్ చేసింది. కొన్ని నివేదికలు సరైనవి కావచ్చు, కొన్ని కాకపోవచ్చు.. కానీ తన నిర్ణయాలను బహిరంగంగా చెప్పేది లేదన్నారు తరూర్. కాగా ఈ ఏడాది చివర్లో కేరళ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో శశి థరూర్ రాజకీయ ప్రయాణం ఆసక్తిగా మారింది.






