ICC: బంగ్లా జట్టుకు ఐసిసి బిగ్ షాక్..!
భారత్ కు తమ జట్టును పంపేది లేదని పట్టుబట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది. తమను బ్రతిమిలాడుతుంది ఐసీసీ అని భావించిన బంగ్లా బోర్డుకు.. పోతే పొండి అని తేల్చి చెప్పేసింది. ఆ స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం కల్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) టోర్నమెంట్ విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో.. ఐసీసీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. శనివారం టీ20 ప్రపంచ కప్ నుండి బంగ్లాదేశ్‌ను తొలగించినట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుందట.
ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్(Scotland)ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎంపిక చేసింది. హైబ్రిడ్ మోడల్ కింద సహ-ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంకకు తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను మార్చాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్ తమ నిర్ణయంలో ఏదోక మాట స్పష్టంగా చెప్పాలని ఐసీసీ గడువు ఇవ్వగా.. బంగ్లా బోర్డు బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ళతో ప్రమేయం లేకుండానే ప్రభుత్వ ఆదేశాలతో బంగ్లా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
చైర్మన్ జై షాతో సహా ఐసిసి అధికారులు శుక్రవారం దుబాయ్‌లో సమావేశమై.. నిన్న సాయంత్రమే బంగ్లా క్రికెట్ బోర్డుకు లేఖ రాసారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఐసీసీ అధికారికంగా సమాచారం ఇచ్చే ముందు బీసీబీ ఢాకాలో విలేకరుల సమావేశం నిర్వహించి.. తాము ఆడేది లేదని స్పష్టం చేసింది. ఐసిసి పదేపదే హామీ ఇచ్చినప్పటికీ, భద్రతా సమస్యలను చూపుతూ బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్.. రాజకీయ కారణాలను సాకుగా చూపించి బంగ్లా బోర్డును.. పక్కకు తప్పించినట్లు సమాచారం.






