Donald Trump: ట్రంప్ చేతిపై గాయం.. అధ్యక్షుడి ఆరోగ్యంపై చర్చ..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఎందుకంటే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వచ్చిన ట్రంప్..సదస్సులో ప్రసంగించారు. అయితే .. ఆసమయంలో ఆయన ఎడమచేతిపై గాయం కనిపించింది. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ జరుగుతోంది.
అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. శాంతిమండలి కార్యక్రమంలో బల్ల కార్నర్ తగలడంతో అధ్యక్షుడి చేతికి గాయమైందన్నారు. ట్రంప్ కూడా దీనిపై స్పందిస్తూ.. ఇదే విషయం పేర్కొన్నారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. దెబ్బకు చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్లు సూచించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఆస్ప్రిన్ తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇక, గతంలో కూడా ట్రంప్ చేతికి ఇలాంటి గాయాలు ఉన్న ఫొటోలు కన్పించాయి. అప్పుడు కూడా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, వైట్‌హౌస్ వాటిని వెంటనే ఖండించింది. రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు నిర్ధరణ అయ్యిందని, అది వృద్ధుల్లో సాధారణంగా కనిపించేదేనని వెల్లడించింది.






