Donald Trump: డ్రాగన్ తినేస్తుంది జాగ్రత్త.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక…!
పలుదేశాలకు భద్రత కల్పించే గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థకు దూరంగా ఉంటామని కెనడా ప్రకటించడం… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఆగ్రహం కలిగించింది. తమ భద్రత కాదని..చైనాతో వ్యాపారం చేసేందుకు వెళ్తున్నారని.. మిమ్మల్ని డ్రాగన్(CHINA) మింగేస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు ట్రంప్.
ఇటీవలే ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో వారిపై నమ్మకం ఉంచని కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘గోల్డెన్ డోమ్ (Golden Dome) నిర్మాణంతో కెనడాకు కూడా రక్షణ లభిస్తుంది. అయినా వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. ఏడాదిలోపే చైనా వారిని తినేస్తుంది’ అని ట్రంప్ (Donald Trump) రాసుకొచ్చారు. ఇటీవల దావోస్ వేదికగా గ్రీన్లాండ్ సుంకాలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్.. గాజా శాంతిమండలిలో చేరాలని ఆ దేశానికి పంపిన ఆహ్వానాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు.
మరోవైపు… ఇటీవల చైనా (China)తో కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిందని కార్నీ ప్రకటించారు. దీనిద్వారా కెనడియన్ కార్మికులు, వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కెనడా ఆహార ఉత్పత్తులపై తక్కువ సుంకాలకు ప్రతిగా.. చైనా ఎలక్ట్రిక్ కార్లపై విధించిన 100 శాతం సుంకాలను తగ్గించడానికి అంగీకరించామని ఆయన తెలిపారు.






