Adulterated Ghee : కల్తీ నెయ్యిపై సిట్ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు
శ్రీవారి పాదాల చెంత భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ అల్లుకున్న కల్తీ కుట్రలు ఇప్పుడు సిట్ (SIT) దాఖలు చేసిన 600 పేజీల తుది ఛార్జ్ షీట్ లో బట్టబయలయ్యాయి. 2019 నుండి 2024 మధ్య జరిగిన ఈ మహా కుంభకోణం కేవలం నిధుల మళ్లింపు మాత్రమే కాదు, కోట్ల మంది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడిగా విచారణలో తేలింది. అసలు పాలే లేని పదార్థాన్ని నెయ్యి పేరిట సరఫరా చేస్తూ, దానికి రసాయనాల రంగు పూసి 20 కోట్ల లడ్డూలను తయారు చేసిన వైనం ఈ దర్యాప్తులో వెలుగుచూడడం అత్యంత దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
ఈ కుంభకోణానికి పునాదులు 2019లో వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే పడ్డాయి. అప్పటి వరకు తిరుమలకు నెయ్యి సరఫరా చేసే సంస్థలకు ఉండే కఠినమైన నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సడలించారు. ఏడాదికి రూ.250 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనను రూ.150 కోట్లకు తగ్గించడం, మూడేళ్ల అనుభవం అవసరం లేదని కేవలం ఏడాది చాలని మార్చడం ద్వారా అర్హత లేని, కనీస మౌలిక సదుపాయాలు లేని డెయిరీలకు దొడ్డిదారిలో ప్రవేశం కల్పించారు. అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హయాంలో జరిగిన ఈ నిబంధనల మార్పులే కల్తీ సంస్థలకు రాచబాట పరిచాయి.
సిట్ దర్యాప్తులో తేలిన మరో సంచలన విషయం ఏమిటంటే, తిరుమలకు సరఫరా అయిన 60 లక్షల కిలోల నెయ్యిలో అసలు పాలు లేదా వెన్న ఆనవాళ్లే లేవు. నిందితులు పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్ వంటి చౌకబారు నూనెలను కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేశారు. దానికి సహజమైన నెయ్యి రంగు రావడానికి ‘బీటాకెరోటిన్’ వంటి రసాయనాలను, ఆకర్షణీయమైన సువాసన కోసం సింథటిక్ ఫ్లేవర్స్‌ను జోడించారు. ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ వంటి సంస్థలు ఢిల్లీ, హర్యానాల నుండి కెమికల్స్ తెప్పించి ఈ మాయా నెయ్యిని సిద్ధం చేసి తిరుమలకు పంపేవి.
ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా సాగిన దందా వెనుక టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ చిన్న అప్పన్న కీలక పాత్ర పోషించినట్లు సిట్ అభియోగపత్రంలో పేర్కొంది. సరఫరా అయ్యే ప్రతి కిలో నెయ్యిపై రూ.25 చొప్పున లంచం డిమాండ్ చేసిన ఆయన, ఆ సొమ్మును హవాలా మార్గాల్లో మళ్లించినట్లు ఆధారాలు లభించాయి. ఐదేళ్లలో ఆయన ఖాతాల్లో రూ.4.69 కోట్లు జమ కావడం, అందులో అత్యధిక భాగం వెంటనే ఇతర ఖాతాలకు మళ్లడం ఈ కుట్రలోని లోతును సూచిస్తోంది. ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ వంటి సంస్థలతో చిన్న అప్పన్న జరిపిన బేరసారాల వివరాలను కూడా సిట్ న్యాయస్థానానికి సమర్పించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దాదాపు 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సాగిన ఈ దర్యాప్తులో మొత్తం 36 మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో టీటీడీ ఉన్నతాధికారులు, డెయిరీ నిపుణులు, రాజకీయ నేతల అనుచరులు ఉన్నారు. అప్పటి ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలతో పాటు కీలక అధికారులను సిట్ విచారించి వారి పాత్రపై ఆరా తీసింది. రూ.235 కోట్ల టీటీడీ నిధుల దుర్వినియోగంతో పాటు, భక్తుల భావోద్వేగాలను పణంగా పెట్టిన ఈ కుంభకోణం ఇప్పుడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేయడం ద్వారా జరిగిన అపచారానికి బాధ్యులైన వారికి కఠిన శిక్షలు పడాలని భక్తులు కోరుకుంటున్నారు.






