Jogi Ramesh: బెయిల్ తర్వాత ఫైర్ మోడ్ లో జోగి ..చంద్రబాబు, లోకేశ్‌లకు బహిరంగ సవాల్..
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh)తో పాటు ఆయన సోదరుడు ఏపీ లిక్కర్ స్కాం కేసులో (Liquor Scam Case) అరెస్ట్ అయి సుదీర్ఘకాలం జైలులో ఉన్న విషయం తెలిసిందే. సుమారు 85 రోజుల పాటు విజయవాడ సెంట్రల్ జైలు (Vijayawada Central Jail) సహా మూడు జైళ్లలో నిర్బంధంలో ఉన్న జోగి బ్రదర్స్‌కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడి వరుసగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తనపై నమోదైన కేసుకు ఎలాంటి ఆధారాలు లేవని, రాజకీయ కక్షతోనే తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)లను ఉద్దేశించి సంచలన సవాల్ విసిరారు. “దమ్ముంటే బెజవాడ దుర్గమ్మ (Kanaka Durga Temple) సాక్షిగా సత్య ప్రమాణం చేయడానికి రావాలి” అంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇందుకోసం వారం రోజుల గడువు ఇస్తున్నానని స్పష్టం చేశారు.
తాను మొదటి నుంచే సీబీఐ విచారణ (CBI Inquiry)కు సిద్ధమని చెప్పానని, లై డిటెక్టర్ పరీక్షలకు కూడా ఒప్పుకున్నానని జోగి రమేష్ గుర్తు చేశారు. అవసరమైతే తిరుమల శ్రీవారి ఆలయంలో (Tirumala) కూడా ప్రమాణం చేస్తానని తెలిపారు. అయినా తనను ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేయించి రాక్షసానందం పొందారని విమర్శించారు. మూడు నెలల పాటు జైళ్ల మధ్య తిప్పడం వెనుక కూడా రాజకీయ కుట్రే ఉందని ఆరోపించారు.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అన్యాయంగా ఇరికించారని జోగి రమేష్ పునరుద్ఘాటించారు. సిట్ అధికారులు (SIT Officials) పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే విచారణ జరిపారని ఆరోపిస్తూ, ఇది న్యాయపరమైన దర్యాప్తు కాదని వ్యాఖ్యానించారు. అయినా తాను భయపడబోనని, ఇలాంటి కేసులతో తనను ఆపడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు.
బెయిల్ వచ్చిన తరువాత తనలో ఉత్సాహం మరింత పెరిగిందని, ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని జోగి రమేష్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ప్రజల ముందు ఎండగడతానని అన్నారు. నారా లోకేశ్ ప్రస్తావించే ‘రెడ్ బుక్’ (Red Book) తనకు భయపెట్టే అంశం కాదని కూడా స్పష్టంగా చెప్పారు.వైసీపీ (YSR Congress Party) మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy)ను మరోసారి ముఖ్యమంత్రి చేసే వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటానని తెలిపారు. ఒకవైపు రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మందుల కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు పాలకులు విదేశీ పర్యటనలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారని దావోస్ (Davos) పర్యటనను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మొత్తానికి జోగి రమేష్ విడుదలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగినట్టుగా కనిపిస్తోంది.






