Vizag Utsav 2026: సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖ.. ఉత్సవ్ -2026తో కొత్త ఉత్సాహం..
విశాఖపట్నం (Visakhapatnam) అంటేనే పర్యాటకానికి చిరునామా అనేలా పేరు తెచ్చుకున్న నగరం. సముద్ర తీరాల అందాలు, కొండల మధ్య ప్రకృతి సోయగాలు, ఆధునిక సిటీ హంగులతో విశాఖకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి విశాఖ నగరాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు ఈసారి విశాఖ ఉత్సవ్–2026 (Vizag Utsav 2026)ను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి 31 వరకు ఎనిమిది రోజుల పాటు సాగర తీరంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఉత్సవాలకు ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ (RK Beach)ను ఎంపిక చేశారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే యువతకు నచ్చేలా అడ్వెంచర్ స్పోర్ట్స్, హెలికాప్టర్ రైడ్స్, పారా మోటరింగ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆహార ప్రియుల కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాల్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఒక్క ఆర్కే బీచ్‌కే పరిమితం కాకుండా రుషికొండ బీచ్ (Rushikonda Beach)లో ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
భీమిలి (Bheemunipatnam) తీరంలో బోట్ రేసింగ్‌ను నిర్వహించటం ఈ ఉత్సవాలకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సముద్ర తీరాన్ని వేదికగా కోస్టల్ ఫుట్‌బాల్ లీగ్, కోస్టల్ వాలీబాల్ లీగ్, కోస్టల్ కబడ్డీ లీగ్ వంటి క్రీడా పోటీలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు ఈసారి విశాఖ ఉత్సవాలను నగరానికి మాత్రమే పరిమితం చేయకుండా అనకాపల్లి (Anakapalli), అరకు (Araku) ప్రాంతాలకు కూడా విస్తరించడం విశేషం. దీంతో పర్యాటకులు విశాఖతో పాటు పరిసర ప్రాంతాల అందాలను కూడా ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విశాఖ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.8 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ ఉత్సవాల ద్వారా లక్షలాది మంది పర్యాటకులు నగరానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల హోటల్ రంగం, రవాణా, చిన్న వ్యాపారాలు, పర్యాటక సేవల రంగాల్లో గణనీయమైన ఆర్థిక చలనం ఏర్పడనుంది. అలాగే వేలాది మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాలం నుంచే విశాఖ ఉత్సవాలను ఒక సంప్రదాయంగా నిర్వహిస్తూ వచ్చింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించినా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం విశాఖను దేశంలోనే ప్రముఖ టూరిజం హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఎనిమిది రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలు విశాఖ నగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చి, “సిటీ ఆఫ్ డెస్టినీ” అనే పేరు మరింత బలపడేలా చేస్తాయని భావిస్తున్నారు.






