Trump: నాటో వర్సెస్ అమెరికా… సభ్య దేశాలపై నమ్మకం లేదన్న ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. నాటోతో బంధాన్ని విచ్చిన్నం చేస్తున్నారా..? తమ బలమైన భాగస్వామ్యంతోనే నాటో కొనసాగుతుందన్న గుడ్డివాదన చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఎందుకంటే ఇటీవల దావోస్ సమావేశం సందర్భంగా నాటో. యూరప్ లపై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదేశాలు .. తన పాలనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లేదంటే మునిగిపోవడం ఖాయమన్న రీతిలో కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ యూరోపియన్ దేశాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
లేటెస్టుగా.. ట్రంప్ నాటో దేశాలపై సంచలన కామెంట్స్ చేశారు. తమ దేశానికి ఏదైనా ప్రమాదం వస్తే.. నాటో సభ్యదేశాలు అండగా నిలుస్తాయని తాను భావించడం లేదని డొనాల్డ్ ట్రంప్.. ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు. ‘‘మాకు అవసరమైనప్పుడు నాటో దేశాలు అండగా ఉంటాయని నేను అనుకోవడం లేదు. అయినా వారి అవసరం మాకు లేదు. వారినెప్పుడూ మేం ఏదీ అడగలేదని తేల్చి చెప్పారు ట్రంప్.
అఫ్గానిస్థాన్‌కు సేనలు పంపామని, ఇంకేదో చేశామని నాటో సభ్యదేశాలు చెబుతున్నాయని… వారు ఎప్పుడూ యుద్ధరంగంలో ముందు లేరు. వెనకే ఉన్నారు’’ అని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. నాటోలో అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తీవ్రంగా స్పందించారు. అఫ్గాన్ యుద్ధంలో కేవలం అమెరికా సేనలే ముందు ఉన్నాయని, మిగతా నాటో దేశాలు యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉన్నాయని ట్రంప్ చెప్పడాన్ని తప్పుబట్టారు. దీనికి ట్రంప్ క్షమాపణ చెప్పాలన్నారు. ఇది తమ సైనికులను అవమానించడమేనని అన్నారు. అఫ్గాన్ పోరులో తమ సైనికులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై బ్రిటన్ యువరాజు హ్యారీ కూడా స్పందించారు. అఫ్గానిస్థాన్‌లో బ్రిటిష్ సైనికుల త్యాగాలను నిజాయతీగా అంగీకరించాల్సిన, గౌరవప్రదంగా స్మరించుకోవాల్సిన సమయం ఇదని వ్యాఖ్యానించారు. ‘‘నేను అఫ్గాన్‌లో సైనిక సేవలు అందించాను. ఎందరో జీవితకాల మిత్రులు అక్కడ నాకున్నారు. చాలా మంది స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బ్రిటన్‌కు చెందినవారే 457 మంది సైనికులు చనిపోయారు. మేము ఎల్లప్పుడూ రక్షణ విషయంలో దౌత్యం, శాంతికి కట్టుబడి ఉన్నాం’’ అని హ్యారీ వివరించారు.
ఐక్యరాజ్యసమితిపై కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. తాను ఛైర్మన్‌గా ఉన్న గాజా శాంతి మండలితో కలిసి పనిచేస్తే ఆ సంస్థకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.






