Davos: ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ కు భారత్ దూరం..? అంతర్జాతీయంగా తీవ్ర చర్చలు..!
ట్రంప్ కలల బోర్డు ఏర్పాటైంది. ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేయడమే కాదు… అందులో 19కి పైగా దేశాలు సంతకాలు చేశాయి. నిజానికి 59 దేశాలు ఇందులో భాగస్వాములవుతాయని ట్రంప్ (Trump) ప్రకటించారు. కానీ సంతకాలు చేసే సమయానికి వారందరూ దూరంగానే ఉన్నారు. దావోస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ హాజరు కాకపోడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి ఆహ్వానించినా మోడీ హాజరు కాకపోవడం.. ఓవిధంగా ప్రాధాన్యం సంతరించుకుంది కూడా.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) వేదికగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ‘బోర్డ్ ఆఫ్ పీస్’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు అంటూ ట్రంప్ సంబోదించారు.
పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా, యూఏఈ, అజర్బైజాన్, హంగేరీ వంటి దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీకి ట్రంప్ నుంచి వ్యక్తిగతంగా ఆహ్వానం అందినప్పటికీ, ఈ కార్యక్రమంలో భారత్ పాల్గొనలేదు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.
ట్రంప్ చొరవతో ఏర్పాటైన ఈ ఏకపక్ష కూటమిలో చేరడం ద్వారా, పాలస్తీనా విషయంలో భారత్ అనుసరిస్తున్న సంప్రదాయ, సమతుల్య విదేశాంగ విధానానికి భంగం కలుగుతుందని, అందుకే భారత్ ఆచితూచి వ్యవహరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.






