Gold Silver Prices: ఆశలొదిలేయండి.. జీవిత కాల గరిష్టాలకు బంగారం.. రూ.2లక్షలే టార్గెట్?
- రూ.1.50 లక్షలు దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం
- తానేమీ తక్కువ కానన్నట్లుగా పరుగులు తీస్తున్న వెండి
- త్వరలో రూ.2 లక్షలకు తులం బంగారం?
- భారంగా మారనున్న ఆడపిల్ల పెళ్లిళ్లు.. మదనపడుతున్న తల్లిదండ్రులు
హైదరాబాద్: సరిగ్గా వందేళ్ల క్రితం బంగారం ధర ఎంతుందో చెబితే షాక్ అవుతారు. 1925లో బంగారం ధర తులం (10 గ్రాములు)కు కేవలం రూ.18.75 మాత్రమేనే విషయం మీకు తెలుసా. 1926లో ఈ ధర స్వల్పంగా తగ్గి రూ.18.43కి చేరుకుంది. తరువాత కొన్నేళ్లపాటు బంగారం ధర దాదాపు స్థిరంగా ఉంది. 1927-28లో 10 గ్రాముల బంగారం ధర రూ. 18.37 ఉండగా, 1930 నాటికి అది రూ.18.50కి చేరింది. జనవరి 1925లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 20.72 డాలర్లుగా ఉంది. కానీ ఇప్పుడు బంగారం, వెండి ధరలు చూస్తుంటే నక్కకు నాగలోకం లాంటి తేడా ఉంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్ ఒక ఉత్కంఠభరితమైన టీ20 మ్యాచ్‌ను తలపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ధరల పెరుగుదల తీరు చూస్తుంటే, పసికూనలపై విరుచుకుపడే స్టార్ బ్యాటర్ల మాదిరిగా ప్రతిరోజూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే వెండి కిలోకు రూ. 3.19 లక్షల మార్కును, బంగారం 10 గ్రాములకు రూ. 1.50 లక్షల మైలురాయిని దాటేసి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి.
పెళ్లిళ్ల వేళ గుబులు.. సామాన్యుడిపై పెను భారం
రాష్ట్రంలో ఫిబ్రవరి 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ధరలు అమాంతం పెరగడం సామాన్యులను కలవరపెడుతోంది. భారతీయ సంప్రదాయంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సామాజిక గౌరవం, భద్రత. పెళ్లికి కనీసం ఐదు నుంచి పది తులాల బంగారం కొనడం మధ్యతరగతి కుటుంబాలకు తప్పనిసరి. అయితే ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1.52 లక్షలుగా ఉండటం ఆ కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. ఇదే జోరు కొనసాగితే పెళ్లిళ్ల సమయానికి పసిడి ధర రూ. 2 లక్షలకు చేరుతుందేమోనన్న భయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
మార్కెట్ తాజా అప్డేట్స్, అంతర్జాతీయ పరిణామాలు
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో (MCX) మార్చి డెలివరీ కిలో వెండి ధర మంగళవారం ఏకంగా రూ. 9,674 పెరిగి రూ. 3.19 లక్షలకు చేరువైంది. అటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.50 లక్షల మార్కును సునాయాసంగా దాటేసింది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ఔన్సు 4,714 డాలర్లకు, వెండి 94.37 డాలర్లకు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
ధరల పెరుగుదలకు కారణాలు..
ట్రంప్ రాజకీయ నిర్ణయాలు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై చూపిస్తున్న ఆసక్తి, వెనెజువెలా మరియు ఇరాన్ దేశాలతో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపర్లు పరుగులు తీస్తున్నారు.
పారిశ్రామిక డిమాండ్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, కొత్త ఇంధన రంగాల నుంచి వెండికి గిరాకీ విపరీతంగా పెరగడం వల్ల వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
రూపాయి బలహీనత: డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.91 మార్కును దాటడం కూడా దేశీయంగా ధరల పెరుగుదలకు తోడైంది.
మధ్యతరగతి వ్యక్తి ప్రేక్షక పాత్రేనా?
ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తుండగా, వివాహ అవసరాల కోసం కొనాలనుకునే మధ్యతరగతి వారు మాత్రం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. “తగ్గితే కొందాం” అని వేచి చూస్తున్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి. మార్కెట్ ఒడిదొడుకులు ఇలాగే కొనసాగితే, వివాహాల సీజన్లో బంగారాన్ని సేకరించడం సామాన్య కుటుంబాలకు భారమైన పనిగా మారనుంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితే తప్ప ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అప్పటి వరకు సామాన్యులు తమ వివాహ బడ్జెట్లను రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.






