YCP: ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త కదలికలు.. ఇరకాటంలో వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కొత్త పార్టీలు పుట్టుకొస్తాయా? ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్న పందాలు కొత్త పార్టీలకు స్థలం ఉందా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆంధ్ర లో మొదటి నుంచి ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంది. ఎప్పుడు కూడా రెండు వర్గాల మధ్య ఈ పోరు నడవడం మనం చూస్తున్నాం. గత కొద్ది కాలంగా దీనికి మూడో వర్గం కూడా తోడైంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), జనసేన (Jana Sena) రెండూ ప్రాంతీయ పార్టీలే. వాటితో కలిసి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) మాత్రం జాతీయ పార్టీ. ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కూడా ప్రాంతీయ పార్టీగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉందా అనే సందేహాలు సహజంగానే వస్తున్నాయి.
ఇటీవల రాజకీయ వర్గాల్లో ఏబీ వెంకటేశ్వరరావు (A B Venkateswara Rao), విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy), వైయస్ షర్మిల (Y S Sharmila) ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరు కొత్త పార్టీలు ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ముగ్గురూ రాజకీయంగా వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ, వారి రాజకీయ ప్రయాణాలు ఒకే దిశగా మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా వీరి రాజకీయ కదలికలన్నీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మాజీ ఇంటెలిజెన్స్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ప్రభుత్వ వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. అధికార మార్పు తర్వాత ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, పదవీ విరమణ తీరుపై ఆయనలో అసంతృప్తి ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే రాజకీయ పార్టీ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్టు ఆయన మాటలు అర్థమవుతున్నాయి. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి.
ఇక విజయసాయిరెడ్డి విషయంలో కూడా పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన, ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. కానీ తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు చూస్తే మళ్లీ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త రాజకీయ వేదికను నిర్మించాలన్న ప్రచారం వినిపిస్తోంది.
వైయస్ షర్మిల విషయానికి వస్తే, ఆమె రాజకీయ ప్రయాణం ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. తెలంగాణ (Telangana)లో పార్టీ స్థాపన, ఆ తర్వాత కాంగ్రెస్ (Congress)లో చేరిక, ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాధ్యతలు వంటి దశలను ఆమె చూశారు. ప్రస్తుతం ఆమె రాజకీయంగా కొంత నిశ్శబ్దంగా ఉండటంతో, మళ్ళీ కొత్త పార్టీ ప్రారంభిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇవన్నీ ఇప్పటివరకు ప్రచార స్థాయిలోనే ఉన్నా, ఈ ముగ్గురిలో ఎవరు నిజంగా పార్టీ ప్రకటించినా అది రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయం. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త సవాలుగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. కొత్త పార్టీలు వస్తాయా లేదా అన్నది కాలమే చెప్పాలి, కానీ ఈ మార్పు మిగిలిన ప్రాంతీయ పార్టీల కంటే కూడా వైసీపీ పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది మాత్రం ఖాయం..






