Devine Sight: శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము.. భక్తుల శివనామస్మరణ!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో సోమవారం నాడు ఒక ఆధ్యాత్మిక అద్భుతం చోటుచేసుకుంది. చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలో వెలసిన విశ్వనాథుని ఆలయంలో సాక్షాత్తు ఆ పరమశివుడి ఆభరణమైన నాగుపాము శివలింగంపై ప్రత్యక్షమైంది. ఆలయ వెనుక భాగంలో ఉన్న పుట్టలో నుంచి వచ్చిన ఒక నాగుపాము, నేరుగా గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పి నిలబడింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
శివుడిని దర్శించుకోవడానికి వచ్చిన వారు ఈ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. “హరహర మహాదేవ శంభో శంకర” అంటూ ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆలయంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రెండుసార్లు నాగుపాము ఇలాగే శివలింగాన్ని చుట్టుకుని భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అరుదైన దృశ్యం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని, నాగుపామును దర్శించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ పాము ఎవరికీ హాని చేయకుండా మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయింది. ఈ వింతను చూసిన భక్తులు ఇది స్వామివారి మహిమేనని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.






