Annamayyapuram: అన్నమయ్యపురంలో వైకుంఠ వాసం భజే
పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని “వైకుంఠ వాసం భజే” కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా పూర్తయ్యాయి.
వైకుంఠ ఏకాదశి రోజున అన్నమయ్య సమేత శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు అందుబాటు చేశారు. దర్శన సమయాలు ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు, సాయంత్రం ఐదు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై వరకు ఉండగా ఈ సమయాల్లో వేల భక్తులు విశేషంగా తరలి వచ్చారు.
డిసెంబరు ముప్పై తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి డిసెంబరు ముప్పై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల వరకు నిరంతరంగా పారాయణ – నృత్యం – వినోదం – సంగీతంతో అన్ని రంగాల్లో విజయవంతంగా కార్యక్రమం సాగింది.
డిసెంబరు ముప్పై తేదీ సాయంత్రం మూడు గంటలకు అన్నమయ్య సదనంలో *”సాయి సన్నిధి కూచిపూడి నృత్య అకాడమీ”* సుమారు 70 మంది శిష్యులచే నూట ఎనిమిది దివ్య సంకీర్తనల నృత్య ప్రదర్శన జరగింది. ఈ నృత్య కైంకర్యానికి గురువుగా శ్రీమతి వి. రాధిక శ్రీనివాస్ గారు వ్యవహరించారు.
అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, అన్నమయ్య అష్టోత్తరం చేశారు.
ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు గారు స్వరపరచిన ప్రత్యేక కీర్తన “వైకుంఠ వాసం భజే” అందరికీ నేర్పారు.
డిసెంబరు ముప్పై ఒకటో తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు పద్మశ్రీ డా. శోభారాజు గారితో కలిసి “శ్రీ అన్నమాచార్య” అనే చక్కని తెలుగు ధారావాహిక వీక్షణ, అనంతరం ఉదయం ఆరు గంటలకు అన్నమాచార్య భావనా వాహిని శిష్యులచేత సంకీర్తనా గానం మరియు మంగళహారతి నిర్వహించారు.
ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు, చైర్మన్ శ్రీ పి. పి. రాజు గారు, సంస్థ వ్యవస్థాపకురాలు శోభారాజు గారు కార్యక్రమ నిర్వహణకు సహకరించిన సేవకులను, భక్తుల కొనియాడారు.
భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అనే దృక్పథంతో దర్శన-పారాయణ-నృత్యం-సంగీతం-వినోదం-సంకీర్తనా గానంతో సాగిన ఈ “వైకుంఠ వాసం భజే” కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది.






