IND vs PAK: శివమెత్తిన ఇషాన్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్
దాయాదుల పోరులో మరోసారి టీమిండియాదే (INDvsPAK) పైచేయి అయింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు 61 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సూర్య సేన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయడమే కాకుండా దర్జాగా సూపర్-8 రౌండ్లోకి అడుగుపెట్టింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు (INDvsPAK) ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (77) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌పై పాక్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్.. మొత్తం 77 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (25), శివమ్ దూబె (27) సమయోచితంగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ (INDvsPAK) 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి
అనంతరం 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ పేకమేడలా కుప్పకూలింది. భారత బౌలర్ల పకడ్బందీ దాడుల ముందు ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఫర్హాన్‌ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చగా, ఆ తర్వాత బుమ్రా.. సైమ్ అయూబ్, సల్మాన్ అఘాలను ఒకే ఓవర్లో ఔట్ చేసి పాక్‌ను (INDvsPAK) కోలుకోలేని దెబ్బ తీశాడు. ఉస్మాన్ ఖాన్ (44) కాసేపు ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలం కూడా తోడవడంతో పాక్ మరో 12 బంతులు మిగిలి ఉండగానే 114 పరుగులకే చాపచుట్టేసింది.
షేక్ హ్యాండ్ ఇవ్వని భారత్..
ఇదిలా ఉంటే ఈ దాయాదుల (INDvsPAK) సమరంలో మరో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయకూడదన్న తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయలేదు. అలాగే మ్యాచ్ ఘనంగా ముగిసిన తర్వాత కూడా టీమిండియా ఆటగాళ్లెవరూ పాక్ ఆటగాళ్లతో చేతులు కలపకుండా తమ నిరసనను బలంగా తెలియజేశారు.
ఇవి కూడా చదవండి













