AGI : గెట్ రెడీ.. మీ జాబులన్నీ గోవిందా గోవిందా!
AI: సాంకేతిక విప్లవం ఒకవైపు సౌకర్యాలను తెస్తుంటే, మరోవైపు సామాన్యుడి బతుకుదెరువును ప్రశ్నార్థకం చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 99 శాతం ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని లూయిస్విల్లే విశ్వవిద్యాలయ కంప్యూటర్ శాస్త్రవేత్త డాక్టర్ రోమన్ యాంపోల్స్కీ సంచలన హెచ్చరికలు చేశారు.
2027.. అసలైన ముప్పు మొదలు:
ప్రస్తుతం మనం చూస్తున్న చాట్ జీపీటీ, జెమినీ వంటివి కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 2027 నాటికి మనిషితో సమానంగా ఆలోచించగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అందుబాటులోకి వస్తుందని, ఇది మనిషి చేయగలిగే ప్రతి పనిని అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తుందని ఆయన విశ్లేషించారు. ఏజీఐ రాకతో 2032 నాటికి దాదాపు అన్ని రకాల వృత్తులు యంత్రమయం అవుతాయని అంచనా వేశారు.
ప్రభావితమయ్యే రంగాలు:
తొలి దశ: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ వంటి కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు త్వరలోనే కనుమరుగవుతాయి.
రెండో దశ: 2030 నాటికి రోబోటిక్స్ పుణ్యమా అని నిర్మాణ రంగం, డ్రైవింగ్, తయారీ రంగం వంటి శారీరక శ్రమతో కూడిన పనులను కూడా ఏఐ స్వాధీనం చేసుకుంటుంది.
ఇవి కూడా చదవండి
ఏ ఉద్యోగాలు మిగులుతాయి?
వంద శాతం ఉద్యోగాలు పోయినా, మానవ స్పర్శ (Human Touch) అవసరమయ్యే కొన్ని రంగాలు నామమాత్రంగా కొనసాగవచ్చని యాంపోల్స్కీ అభిప్రాయపడ్డారు. ధనవంతులకు వ్యక్తిగత సహాయకులుగా ఉండేవారు, సంక్లిష్టమైన ఏఐ వ్యవస్థలను పర్యవేక్షించే ఉన్నత స్థాయి నిపుణులు, మానసిక శ్రద్ధ అవసరమయ్యే కొన్ని వృత్తులు మాత్రమే మనుగడ సాగించే అవకాశం ఉంది.
జీవనం ఎలా?
ఉద్యోగాలు లేని ప్రపంచంలో మనుషులు ఎలా బతుకుతారనే దానికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (UBI) ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాలు కూడా ఇదే విషయాన్ని సమర్థిస్తున్నారు. యంత్రాల ద్వారా వచ్చే లాభాలను ప్రభుత్వాలు ప్రజలకు పంచే కొత్త ఆర్థిక వ్యవస్థ అవసరమని వారు సూచిస్తున్నారు.
సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా, శ్రమ లేకుండా మనిషి జీవనం ఎలా ఉంటుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇవి కూడా చదవండి













