Gold Price: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త… రూ.లక్షకు పడిపోనున్న బంగారం!?
Gold Price: గత ఏడాది కాలంగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు త్వరలో భారీగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల (తులం) మేలిమి బంగారం ధర సుమారు రూ. 1.59 లక్షల వద్ద ఉండగా, భవిష్యత్తులో ఇది రూ. 90,000 నుండి రూ. 1,00,000 మధ్యకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.
ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు ఇవే:
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో వచ్చే జూన్ నాటికి రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం ఆగిపోతే అంతర్జాతీయంగా అనిశ్చితి తగ్గి, బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి.
డాలర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత: అంతర్జాతీయ వాణిజ్యాన్ని మళ్లీ అమెరికా డాలర్లలో నిర్వహించేందుకు రష్యా మొగ్గు చూపుతోంది. దీనివల్ల డాలర్ విలువ పెరిగి, పెట్టుబడిదారులు బంగారం నుండి తమ నిధులను అమెరికా బాండ్ల వైపు మళ్లిస్తారు.
అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 5,000 డాలర్ల వద్ద ఉండగా, 2027 నాటికి ఇది 3,000 డాలర్లకు పడిపోవచ్చని అనుజ్ గుప్తా, అమిత్ గోయల్ వంటి నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బ్రిక్స్ దేశాల ప్రభావం:
ప్రపంచ పసిడి నిల్వల్లో దాదాపు 20% వాటా కలిగిన బ్రిక్స్ (BRICS) దేశాలు, డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని నిల్వ చేసుకుంటుండటంతో గతంలో ధరలు పెరిగాయి. అయితే, రష్యా మళ్లీ డాలర్ వాణిజ్యానికి సుముఖత చూపడం బ్రిక్స్ ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా మారనుంది. ఒకవేళ కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు ఆపేస్తే, ధరలు మరింత వేగంగా దిగివచ్చే అవకాశం ఉంది.
గతేడాది 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ. 1.80 లక్షలను తాకిన విషయం తెలిసిందే. తాజా అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక పండగ లాంటి వార్త అనే చెప్పాలి.













