BJP: కరీంనగర్ పీఠంపై కమల వికాసం… బీజేపీ నెత్తిన పాలుపోసిన బీఆర్ఎస్!
ఉత్కంఠకు తెరపడింది. రాజకీయ చదరంగంలో ఎత్తులకు పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాల మధ్య కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) కైవసం చేసుకుంది. నగర మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ గెలుపులో బీజేపీ వ్యూహం ఎంత ఉందో, అంతకంటే ఎక్కువగా భారత్ రాష్ట్ర సమితి (BRS) తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీని నిలువరించే క్రమంలో బీఆర్ఎస్ అనుసరించిన ‘తటస్థ’ వ్యూహం, పరోక్షంగా బీజేపీ నెత్తిన పాలుపోసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 30 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మేయర్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అందలేదు. మరోవైపు 14 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.., మజ్లిస్ (3), స్వతంత్రుల (10) మద్దతుతో పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తన మేయర్ అభ్యర్థిగా నర్మదను బరిలోకి దించింది.

అయితే ఎన్నిక సమయంలో అసలైన ట్విస్ట్ బీఆర్ఎస్ రూపంలో వచ్చింది. మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యాక బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వచ్చారు. తమకు అధికారానికి కావాల్సిన సంఖ్య లేదని, అందుకే బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తున్నామని వారు పైకి చెబుతున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఇది బీజేపీకి క్లియర్ వే ఇచ్చినట్లయింది.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ ఎన్నికను బహిష్కరించడంతో సభలో సభ్యుల సంఖ్య తగ్గింది, తద్వారా బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. బీఆర్ఎస్ మద్దతు కాంగ్రెస్‌కు లభించి ఉంటే సమీకరణాలు మరోలా ఉండేవి. కానీ, కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకూడదనే ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మేలు చేసిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

బీఆర్ఎస్ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. “బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని మేం మొదటి నుంచి చెబుతున్నాం. ఇవాళ కరీంనగర్ సాక్షిగా అది నిజమైంది” అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వైఖరిని ‘అపవిత్ర కలయిక’గా వారు అభివర్ణించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ తన సిద్ధాంతాలను పక్కన పెట్టి మతతత్వ పార్టీకి సహకరించిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ సహకారంతోనే గెలిచారన్న ఆరోపణలు పక్కన పెడితే, కరీంనగర్ కార్పొరేషన్‌ను దక్కించుకోవడం బీజేపీకి చారిత్రాత్మక విజయం. ఉత్తర తెలంగాణలో పట్టు సాధించాలని చూస్తున్న కమల దళానికి ఈ విజయం బూస్ట్ ఇచ్చేదే. మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొలగాని శ్రీనివాస్.. నగర అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి













