శివోహం మహోత్సవంలో సీఎం చంద్రబాబు: ఆధ్యాత్మిక సంకల్పం, అమరావతిని భక్తుల రాజధాని గా అభివృద్ధి
అమరావతి,ఫిబ్రవరి 15: దేవాలయాల పరిరక్షణపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక భావన కలిగి ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార ఆలయ ప్రాంగణంలో మహాటీవీ నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వేదికపై చేపట్టిన పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…శివోహం కార్యక్రమాన్ని నిర్వహించిన మహాన్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ, సిబ్బంది, నిర్వాహకులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. దేవతల రాజధాని, ప్రజా రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామం. పరమశివుడు చీకట్లు తొలగించి వెలుగులు ప్రసాదిస్తాడు.
ఇవి కూడా చదవండి
శివారాధనే ముక్తికి దగ్గర దారి. ఆనాడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించాం. నేడు అమరావతి నిర్మిస్తున్నాం. అమరావతి భావితరాలకు ఆదర్శ నగరంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. రాష్ట్రం బాగుండాలని, సకాలంలో పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం సహా సంపద సృష్టించి దాన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తిరిగి పేదలకు అందేలా దీవించమని ఆ పరమశివుడిని ప్రార్ధిస్తున్నాను. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. పేదరిక నిర్మూలన, అందరికీ సమాన అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. ఏపీ అంటే క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్ , ఐటీ హబ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ. సంపద సృష్టించాలంటే టెక్నాలజీ అవసరం. ఆనాడు హైదరాబాద్ లో ఐటీని ప్రమోట్ చేయడానికి మెక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను తీసుకొచ్చాను. నేడు ఏఐ, క్వాంటమ్ వచ్చాయి. 16వ తేదీన బిల్ గేట్స్ మన అమరావతి వచ్చి మరింత చేయూత అందిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి
టెంపుల్ టూరిజంలో భాగంగా ఆలయాల అభివృద్ధి
ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం. ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధిగాంచింది. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన శ్రీశైల పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం అదృష్టం. పంచారామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, ద్రాక్షారామం, మహానంది, శ్రీముఖ లింగం, కోటప్పకొండ వంటి ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. దేవాలయాల సంరక్షణ, నిర్వహణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఆలయంలోనూ నిత్య దీపారాధన, నైవేద్యం పెట్టాలనేది మా విధానం. దేవాలయాల పవిత్రత, భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే భక్తుల మనోభావాలు, సెంటిమెంట్లను గౌరవిస్తాం. ఇటీవల కాలంలో ఆలయాలు, జాతరలకు భక్తుల రద్దీ పెరిగింది. స్త్రీ శక్తి ద్వారా ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో దేవాలయాలకు వెళ్లే మహిళల సంఖ్య పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను ప్రాణదానం, శ్రీవారి సేవ కార్యక్రమాలు ప్రారంభించాను. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధాని సహా గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల దేవాలయాలు నిర్మించాలని తలపెట్టాం. ముఖ్యమంత్రిగా గోదావరి, కృష్ణా పుష్కరాలను మూడోసారి నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం
ప్రజల్లో ఆధ్మాత్మిక చైతన్యం తీసుకురావడంతో పాటు, తెలుగు నేలపై భక్తి ఉద్యమం నడుపుతున్న మహాటీవీ సీఎండీ వంశీకృష్ణను అభినందిస్తున్నాను. గతేడాది ఇదే ప్రాంతంలో శివోహం ఆ తర్వాత కాకినాడలో సీతారాముల కల్యాణం, హైదరాబాద్ గచ్చిబౌలిలో శ్రీనివాస కల్యాణం నిర్వహించారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ, మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి













