NZ vs SA: కివీస్‌పై సౌతాఫ్రికా సూపర్ విక్టరీ.. సూపర్-8 బెర్తు ఖాయమైనట్లే?
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా (NZvsSA) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో సఫారీలకు ఇది వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. ఈ అద్భుత విజయంతో దక్షిణాఫ్రికా గ్రూప్-డి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి సూపర్-8 బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ (NZvsSA) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మార్క్ చాప్మన్ (48), డారిల్ మిచెల్ (32), ఓపెనర్ ఫిన్ అలెన్ (31) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 కీలక వికెట్లు పడగొట్టి కివీస్‌ను కట్టడి చేశాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 178 పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
సఫారీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడు కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా (NZvsSA) తరఫున అత్యంత వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. క్వింటన్ డికాక్ (20), ర్యాన్ రికెల్టన్ (21) కూడా తమ వంతు పాత్ర పోషించారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (24 నాటౌట్) భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అద్భుత బౌలింగ్‌తో కివీస్ పతనాన్ని శాసించిన జాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













