UC Berkeley: అమెరికాలో విషాదం.. సరస్సులో భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభ్యం
UC Berkeley: అమెరికాలోని ప్రతిష్టాత్మక యుసి బర్కిలీ (UC Berkeley) విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువుల కోసం వెళ్ళిన భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య విగతజీవిగా కనిపించారు. గత కొన్ని రోజులుగా అదృశ్యమైన సాకేత్ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చేపట్టగా, ఫిబ్రవరి 14, 2026 శనివారం మధ్యాహ్నం కాలిఫోర్నియాలోని లేక్ అంజా (Lake Anza) లో ఆయన మృతదేహం లభ్యమైంది. సాకేత్ అదృశ్యమైన తర్వాత అతని వ్యక్తిగత వస్తువులు సరస్సు సమీపంలోని పార్క్ హిల్స్ పరిసరాల్లో లభించడంతో, అధికారులు సోనార్ పరికరాలు, డ్రోన్లు, ప్రత్యేక డైవ్ బృందాలను రంగంలోకి దించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అలమెడ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన డైవర్లు సరస్సు లోతుల్లో నుండి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మృతదేహం సాకేత్దేనని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం కాంట్రా కోస్టా కౌంటీ కరోనర్ కార్యాలయం ఈ కేసును స్వీకరించి తదుపరి దర్యాప్తు ప్రారంభించింది.
రూమ్మేట్ ఆవేదన:
ఈ విషాద ఘటనపై సాకేత్ రూమ్మేట్ సోషల్ మీడియా (లింక్డ్ఇన్) వేదికగా అత్యంత భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. గత రెండు వారాలుగా సాకేత్ ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు వచ్చాయని, అతను సరిగ్గా తినడం మానేసి, అందరితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడని ఆయన పేర్కొన్నారు. సాకేత్ జీవితం పట్ల విరక్తి చెందినట్లు మాట్లాడేవాడని, అయితే అది ఇంతటి తీవ్ర నిర్ణయానికి దారితీస్తుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “అంతర్జాతీయ విద్యార్థిగా పరాయి దేశంలో ఒంటరి పోరాటం చేయడం చాలా కష్టం. దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎప్పుడూ టచ్లో ఉండండి, వారు ఎలా ఉన్నారో అడిగి తెలుసుకోండి” అని ఆయన తోటి విద్యార్థులను కోరారు.
భారత కాన్సులేట్ సహాయం:
మరోవైపు, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ సాకేత్ కుటుంబానికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియజేసింది. సాకేత్ తల్లిదండ్రులు భారత్ నుండి అమెరికా రావడానికి అవసరమైన ‘అత్యవసర వీసా’ ప్రక్రియలో అధికారులు చురుగ్గా సహకరిస్తున్నారు. అవసరమైన అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి, సాకేత్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక పోలీసు, విశ్వవిద్యాలయ అధికారులతో కాన్సులేట్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఘటనతో యూసీ బర్కిలీలోని భారతీయ విద్యార్థి సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవగా, చదువుల ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.













