Tamilnadu: తమిళ రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం..!
తమిళ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు దశాబ్దాలుగా అందరికీ సుపరిచితమే. గతంలో అన్నాదురై మొదలుకొని తర్వాత వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత .. ఇలా ఎందరో దిగ్గజాలు వ్యక్తిగత విమర్శలు చేశారు. వ్యక్తిగతవిమర్శలకు గురయ్యారు. అంటే .. కరెక్టుగా చెప్పాలంటే.. తమిళ రాజకీయాల్లో వ్యక్తిత్వ విమర్శలు కూడా భాగంగా మారుతున్నాయి. ఇది అవాంచిత పరిణామమైన.. తప్పడం లేదన్నది రాజనీతిజ్ఞుల మాట.
లేటెస్టుగా ..ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్‌ని లక్ష్యంగా చేసుకుని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ మొదట ఇల్లు దాటి బయటకు రావాలని, త్రిషతో అనుబంధం నుంచి బయటపడితేనే రాజకీయాల్లో వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.
విజయ్‌ని ఉద్దేశించి నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ తన పార్టీకి, డీఎంకేకు మధ్యే ఉంటుందని, బీజేపీ వంటి పార్టీలు రేసులో లేవని విజయ్ ఇటీవల బహిరంగసభలో వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై నాగేంద్రన్ స్పందిస్తూ, విజయ్‌కు రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో డ్యాన్సులు వేసుకోవడానికే పరిమితమని చురక అంటించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.
విజయ్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదని టీవీకే నాయకులు మండిపడ్డారు. అధికార డీఎంకే పార్టీ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించింది. కనిమొళి ‘ఎక్స్’ వేదికగా బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలోని మహిళా నాయకులు నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని వ్యాఖ్యానించారు. మహిళలను అవమానించేలా మాట్లాడటం సరికాదని అన్నారు.













