Modi: కాంగ్రెస్ హయాంలో జాతీయ భద్రతకు దక్కని ప్రాధాన్యం: మోదీ
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకప్పుడు ఈశాన్య ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో బతికారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అస్సాంలో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వెళ్లిన ప్రధాని ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. దిబ్రూగఢ్ జిల్లాలోని మోరాన్ బైపాస్ వద్ద కొత్తగా నిర్మించిన 4.2 కిలోమీటర్ల పొడవైన హైవే ఎయిర్‌స్ట్రిప్‌పై ప్రధాని ప్రయాణిస్తున్న విమానం నేరుగా ల్యాండ్ అయింది. తద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీ (హైవేపై విమానం దిగే సదుపాయం) పై దిగిన తొలి భారత ప్రధానిగా మోదీ (PM Modi) రికార్డు సృష్టించారు. అనంతరం భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ల విన్యాసాలను ఆయన వీక్షించారు.
ఈ సందర్భంగా గువాహటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. అత్యవసర సమయాల్లో, ముఖ్యంగా ప్రకృతి విపత్తుల వేళ ఈ హైవే ఎయిర్‌స్ట్రిప్ ఎంతో కీలకంగా మారుతుందన్నారు. గత పదేళ్లలో దేశ సరిహద్దుల్లో ఆధునిక సొరంగాలు, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్‌లు నిర్మించి సైన్యాన్ని మరింత బలోపేతం చేశామన్నారు. కాంగ్రెస్ పాలనలో రక్షణ శాఖ కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన (PM Modi) ఆరోపించారు. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం రోడ్లు కూడా సరిగా ఉండేవని కావని, కానీ ఇప్పుడు ఏకంగా విమానాలు దిగే స్థాయికి హైవేలను అభివృద్ధి చేశామని మోదీ గర్వంగా చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా బ్రహ్మపుత్ర నదిపై రూ. 3,030 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆరు లేన్ల ‘కుమార్ భాస్కర్ వర్మ సేతు’ను (గువాహటి – ఉత్తర గువాహటిని కలిపే వంతెన) కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.













