Bangladesh: బీఎన్పీ విజయంతో భారత్-బంగ్లా బంధాలు మెరుగయ్యేనా..?
బంగ్లాదేశ్‌లో (Bangladesh) జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించి అధికార పీఠం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో భారత్-బంగ్లా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు కేవలం అవామీ లీగ్‌తోనే సన్నిహితంగా మెలిగిన భారత్.. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీఎన్పీతోనూ స్నేహం చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల ఫలితాల్లో బీఎన్పీకి మెజారిటీ ఖాయమైనట్లు తేలగానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బీఎన్పీ చీఫ్ తారిఖ్ రెహమాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తారిఖ్ నాయకత్వంపై బంగ్లా ప్రజలకున్న విశ్వాసానికి ఈ విజయం ప్రతీక అని ప్రధాని కొనియాడారు. బంగ్లాదేశ్ (Bangladesh) పురోగతికి, ప్రజాస్వామ్యానికి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయని మోదీ ఆకాంక్షించారు. ప్రధాని వ్యాఖ్యలపై బీఎన్పీ కూడా సానుకూలంగా స్పందించింది. తమ విజయాన్ని భారత్ గుర్తించడాన్ని స్వాగతిస్తున్నామని బీఎన్పీ నేత నజ్రుల్ ఇస్లాం ఖాన్ పేర్కొంటూ.. రెండు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు దేశ భవిష్యత్ విధానాలపై తారిఖ్ రెహమాన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. తమ విదేశాంగ విధానం ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా ఉంటుందని, ‘బంగ్లాదేశ్ (Bangladesh) ఫస్ట్’ (దేశానికే ప్రథమ ప్రాధాన్యం) అనేదే తమ ప్రధాన నినాదమని ఆయన తేల్చిచెప్పారు. తాము ఏ దేశానికీ బానిసలం కాదని, అందరికీ మిత్రులమేనని పేర్కొన్నారు. భారత్ లేదా పాకిస్తాన్ పక్షం వహించకుండా, కేవలం స్వదేశీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామన్నారు. మైనార్టీల భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని ప్రకటించిన ఆయన.. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతమని, ప్రభుత్వం అందరి కోసం సమానంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. దౌత్యపరమైన చర్చల ద్వారా చొరబాట్ల సమస్యతో పాటు, పద్మ తదితర నదీ జలాల పంపిణీ లాంటి సున్నితమైన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని వెల్లడించారు.













