ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఆప్షనల్ హాలిడే మంజూరు చేసింది.
ఈసారి శివరాత్రి ఆదివారం రావడంతో ఆ రోజు సాధారణ సెలవే వచ్చింది. అయితే రాత్రంతా జాగరణ చేసే భక్తుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మరుసటి రోజు కూడా అవకాశం కల్పించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేస్తూ 16వ తేదీన ఆప్షనల్ హాలీడే ప్రకటించారు. ఉద్యోగుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్‌లో విడుదల చేసిన సెలవుల జాబితాలో సవరణలు చేసి గెజిట్ కూడా జారీ చేశారు. దీంతో ఉద్యోగులు అవసరమైతే సోమవారం సెలవు తీసుకునే వీలు ఏర్పడింది.
ఫిబ్రవరి 16న పాఠశాలలకు కూడా ఆప్షనల్ హాలీడే వర్తిస్తుంది. అయితే పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల కారణంగా స్కూళ్లు సాధారణంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
శివరాత్రి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం ప్రారంభమై 16 సాయంత్రం వరకు ఉంటుంది. ప్రధాన పండుగ 15న జరగనుండగా, భక్తుల సౌకర్యార్థం 16న ఆప్షనల్ హాలీడే కల్పించారు.
శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అందుకే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి వెళ్లేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.