Aatadina Pata: అమెరికాలో ఘనంగా ‘ఆటాడిన పాట’ టైటిల్ లాంచ్
▪️ టైటిల్ లాంచ్ చేసిన ATA ప్రెసిడెంట్ జయంత్ చల్లా
▪️ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన నిర్మాత నాగేశ్వర్ రావు పూజారి
▪️ NRI ల సమక్షంలో ఘనంగా జరిగిన వేడుక
స్టెర్లింగ్ (వర్జీనియా): నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ రచయిత వేణు నక్షత్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లాంచ్ కార్యక్రమం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం, స్టెర్లింగ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి టైటిల్‌ను అధికారికంగా లాంచ్ చేయగా, టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు వేణు నక్షత్రం ఈ సందర్భంగా తెలిపారు.
దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ…
“ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి, తమ సన్నిహిత మాటలతో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన జయంత్ చల్లా గారికి, అలాగే నాగేశ్వర్ రావు పూజారి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ మెట్రో ప్రాంత ప్రేక్షకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులు, మాకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రేమతో వందనాలు. ఇలాగే మీ ప్రేమను, ఆశీర్వాదాలను మా మీద కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అన్నారు.
చిత్ర నిర్మాత అవంతిక నక్షత్రం మాట్లాడుతూ…
“మా మీద నమ్మకం ఉంచి, ప్రతి అడుగులో అండగా నిలిచిన టీమ్ ‘ఆటాడిన పాట’కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమ, ఆదరణే మా ప్రయాణానికి బలము. ‘ఆటాడిన పాట’ మీ హృదయాలను తాకే రోజు త్వరలోనే వస్తుంది. ప్రతి ఒక్కరి నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందన్న నమ్మకం మాకు బలంగా ఉంది. సోషియో ఫాంటసీ జానర్ లో షూటింగ్ పూర్తి అయి CG వర్క్ చివరి ఘట్టం జరుగుతోంది. ప్రధాన పాత్రల్లో నటించిన అభినవ్ గోమఠం గారికి, స్వాతి శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు.






