Houston: హుస్టన్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు.. వైభవంగా ముగిసిన వేడుకలు
అమెరికాలోని హుస్టన్ నగరంలో సంక్రాంతి సంబరాలు విజయవంతమయ్యాయి. జనవరి 17న హుస్టన్ లోని హనుమాన్, దత్త యోగా కేంద్రం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు కమ్యూనిటీ అత్యంత ఉత్సాహంగా పాల్గొంది. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రవాస భారతీయులకు పల్లెటూరి పండగ వాతావరణాన్ని గుర్తుచేశాయి.
వేడుకల హైలైట్స్..
గంగిరెద్దుల ఊరేగింపు: ఉదయం గురు నిలయం నుండి ఈవెంట్ హాల్ వరకు నిర్వహించిన గంగిరెద్దుల ఊరేగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ముగ్గుల పోటీలు & పొంగలి: తెలుగు ఇంటి ఆడపడుచులు తమ ప్రతిభతో వేసిన రంగురంగుల ముగ్గులు, సంప్రదాయబద్ధంగా పొయ్యి మీద వండిన పొంగలి వంటకాలు పండగ నిండుదనాన్ని పెంచాయి.
ఆధ్యాత్మికం & సంప్రదాయం: పూజ, అన్నకూట కార్యక్రమాలతో పాటు కృష్ణ కోలాటం, HDYC ప్రసంగాలు వేడుకలకు ఆధ్యాత్మిక శోభను ఇచ్చాయి.
పిల్లల సందడి: ఐదేళ్లలోపు చిన్నారులకు నిర్వహించిన భోగి పళ్ల వేడుక, భోగి మంటలు, సామూహిక కోలాటం అందరినీ అలరించాయి.
వినోదం, రుచులు: అన్ని వయసుల వారి కోసం నిర్వహించిన ఆటలు, డీజే సంగీతం, నోరూరించే విందు భోజనం అతిథులకు మధురానుభూతిని అందించాయి.
కృతజ్ఞతలు…
ఈ బృహత్తర కార్యక్రమాన్ని అన్నీ తామై నడిపించి, అద్భుతమైన ప్రణాళికతో విజయవంతం చేసిన నాయకత్వానికి అక్కడికి వచ్చినవారంతా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా, ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన కనకం,ఆంజనేయులు కోనేరు ప్రత్యేక అభినందనలు చెప్పారు. అలాగే కార్యనిర్వాహక వర్గంలో విశేష కృషి చేసిన ముత్యాల రాజాకు, తన సహకారాన్ని అందించిన డైరెక్టర్ (కౌంటీ జడ్జి కార్యాలయం), బంగారు రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రధానంగా, మన తెలుగు వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, ఈ సంక్రాంతి సంబరాలకు ప్రధాన దాతలుగా వ్యవహరించిన పారిశ్రామికవేత్తలు చార్లీ, యాంజెలా యలమంచిలికి అభినందనలు తెలిపారు. వాలంటీర్ల నిరంతర శ్రమ, అందరి సహకారంతో ఈ ఈవెంట్ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.






