Pulivendula: పులివెందులలో బలహీనపడుతున్న వైసీపీ ఆధిపత్యం.. పెరుగుతున్న టీడీపీ పట్టు..
పులివెందుల (Pulivendula) అంటేనే ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి అడ్డా అనే మాట రాజకీయాల్లో బలంగా వినిపించేది. వరుస విజయాలతో ఈ నియోజకవర్గం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy)కి అత్యంత బలమైన కంచుకోటగా నిలిచింది. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం మారితే పరిస్థితులు కూడా మారతాయన్న మాట ఇప్పుడు పులివెందులలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో ఇక్కడి రాజకీయ వాతావరణం పూర్తిగా మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు జగన్‌తో కలిసి నడిచిన నాయకులే ఇప్పుడు పార్టీకి దూరమవుతున్నారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడం ఈ మార్పులకు ఆరంభంగా మారింది. ఆ తర్వాత దశలవారీగా పలువురు ముఖ్య నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. బయటకు పెద్దగా హడావుడి లేకపోయినా, చాపకింద నీరు మాదిరిగా టీడీపీ ప్రభావం గ్రామగ్రామానికీ విస్తరిస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీగా టీడీపీ మాత్రమే కనిపిస్తుండటం కూడా ఈ వలసలకు కారణమని చెబుతున్నారు. ఇతర పార్టీల ప్రభావం పెద్దగా లేకపోవడంతో అసంతృప్త నేతలు సూటిగా టీడీపీ గూటికే చేరుతున్నారు. ఈ క్రమంలో వేంపల్లి (Vempalli) ప్రాంతానికి చెందిన వైసీపీ నేత, జగన్‌కు సన్నిహితుడిగా పేరున్న చంద్రశేఖర్ రెడ్డి (Chandrasekhar Reddy) టీడీపీ కండువా కప్పుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆయనతో పాటు వందలాది మంది కార్యకర్తలు కూడా సైకిల్ పార్టీ వైపు అడుగులు వేయడం వైసీపీకి షాక్‌లా మారింది.
ఒకప్పుడు జగన్ కోసం ప్రాణం ఇస్తామని చెప్పిన నేతలు కూడా పార్టీని వీడటం వైసీపీ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి (B.Tech Ravi) చేసిన ప్రకటనలు కూడా కీలకంగా మారాయి. కొత్తగా వచ్చే వారికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరినీ బలవంతంగా రప్పించబోమని, కానీ స్వచ్ఛందంగా వస్తే మాత్రం ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో అసంతృప్త వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇక ఓటు బ్యాంకు విషయంలోనూ మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో వైసీపీ మాట వినిపించేదని, ఇప్పుడు ఆ స్థాయి ఉత్సాహం కనిపించడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పులివెందులలో సమర్థంగా అమలవుతున్నప్పటికీ, ప్రజల్లో రాజకీయ అభిరుచులు మారుతున్నాయన్న భావన బలపడుతోంది. రాబోయే మునిసిపల్ ఎన్నికల నాటికి ఈ ప్రభావం మరింత స్పష్టంగా బయటపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్‌కు బలంగా నిలిచిన పులివెందుల రాజకీయంగా క్రమంగా డైల్యూట్ అవుతోందన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.






