YCP: ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రత్యేక దృష్టి.. పార్లమెంట్ సీట్లే లక్ష్యంగా కొత్త వ్యూహం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర (North Andhra) ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి, దాని ప్రభావంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించాలని పార్టీ వ్యూహం రచిస్తోంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ఒక్క చోట మాత్రమే విజయం దక్కడం వైసీపీకి నిరాశ కలిగించింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు శ్రీకాకుళం (Srikakulam) పార్లమెంట్ స్థానం మాత్రం కొరకరాని కొయ్యగానే ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఏకైక స్థానం అరకు (Araku) మాత్రమే కావడం ఈ ప్రాంతంపై ఫోకస్ పెంచడానికి కారణమైంది.
విశాఖపట్నం (Visakhapatnam) పార్లమెంట్ స్థానం వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ (Sribharat) విజయం సాధించగా, వైసీపీ తరఫున బొత్స ఝాన్సీ లక్ష్మి (Botsa Jhansi Lakshmi) ఓటమి పాలయ్యారు. ఈసారి ఆమె విజయనగరం (Vizianagaram) ఎంపీ స్థానం వైపు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. విశాఖ సీటుకు సంబంధించి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన చోడవరం (Chodavaram) నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. మరోవైపు మాజీ ఎంపీ ఎంవీవీఎస్ సత్యనారాయణ (MVVS Satyanarayana) కూడా పోటీపై ఆసక్తి చూపుతున్నా, పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉన్నారు. వీరిలో ఒకరికి టికెట్ ఖరారయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అనకాపల్లి (Anakapalli) విషయానికి వస్తే, గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీఎం రమేష్ (CM Ramesh) గెలిచారు. వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు (Budi Mutyala Naidu) ఓడిపోయిన తర్వాత మళ్లీ ఎంపీ రేసులోకి రావడంపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అందుకే ఈసారి కొత్త ముఖాన్ని రంగంలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. గవర సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వవచ్చని, అలాగే ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (Varudu Kalyani) పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
అరకు పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ తనుజా రాణి (Dr. Tanuja Rani)కి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం బలంగా ఉంది. ఆమెకు బదులుగా మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి (Bhagyalakshmi) పేరు కూడా వినిపిస్తోంది. అంతేకాదు మాజీ మంత్రులు రాజన్న దొర (Rajanna Dora), పాముల పుష్ప శ్రీవాణి (Pamula Pushpa Sreevani) కూడా ఆసక్తి చూపుతున్నారని చర్చ సాగుతోంది.
విజయనగరం ఎంపీ స్థానంపై కూడా పోటీ ఎక్కువగా ఉంది. బొత్స కుటుంబం నుంచి చిన్న శ్రీను (Chinna Srinu)ను రంగంలోకి దింపుతారన్న ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన భీమిలి (Bhimili) అసెంబ్లీ ఇన్చార్జిగా ఉన్నారు. అదే సమయంలో ఝాన్సీ లక్ష్మి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (Bellana Chandrasekhar) పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం మాత్రం ఇప్పటికీ వైసీపీకి సవాల్‌గా మారింది. 2019లోనూ, 2024లోనూ టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) గెలిచి హ్యాట్రిక్ సాధించారు. వివిధ సామాజిక వర్గాలతో ప్రయోగాలు చేసినా ఫలితం దక్కకపోవడంతో, వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం (Thammineni Seetharam) లేదా ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.






