BMC Elections: ఠాక్రేల ముంబై కోట కూలిందిలా…? మేయర్ పీఠంపై తొలిసారి బీజేపీ నేత..!
ఆసియాలోనే అత్యంత ధనిక, అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ .. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు సంచలన తీర్పిచ్చారు. 25 ఏళ్ల ఠాక్రేల పాలనకు చరమగీతం పాడి.. అభివృద్ధి అజెండాకు జై కొట్టారు. దీంతో తొలిసారి బీజేపీ మేయర్ పదవి దక్కించుకోబోతోంది. కేవలం బీఎంసీ మాత్రమే కాదు.. మహారాష్ట్రలోని 29 నగరపాలక సంస్థల్లో 25 చోట్ల మహాయుతి ఘన విజయం సాధించింది. ఠాక్రే సోదరులు సహా మొత్తం ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది.
బీఎంసీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగాయి. ఈ ఎన్నికలతో 25 ఏళ్ల తర్వాత బీఎంసీపై శివసేన పట్టు పూర్తిగా తెగిపోయింది. ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం ఏమవుతుంది? ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. శివసేన ఉనికిని కాపాడాలనే ఉద్దేశంతో రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు కలిసినా.. వారిని మహారాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ముంబైలో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు 25 ఏళ్ల తర్వాత గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది.
ఈ ఫలితాలు ఉద్ధవ్–రాజ్ జోడీని ముంబై ప్రజలు అంగీకరించలేదని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ జోడీ రాజకీయాలు ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. ఉత్తర భారతీయులపై జరిగిన హింస ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మరాఠేతర ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో ఠాక్రే సోదరులు విఫలమయ్యారు. మరోవైపు ముస్లిం ఓటర్లు ఈ కూటమికి దూరంగా ఉన్నారు. గత 25 ఏళ్లుగా మతోశ్రీలో ఎన్నికల ఫలితాల సందర్భంగా జరుపుకునే సంబరాలు ఈసారి కనిపించలేదు. అక్కడ నిశ్శబ్దమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాజ్ ఠాక్రేతో కలిసి రావడం ఉద్ధవ్‌కు నష్టమయ్యిందా? కాంగ్రెస్‌కు దూరంగా ఉండటం రాజకీయంగా భారమైందా? బాలాసాహెబ్ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో షిండేతో ఉన్న శివసేనపై ప్రజలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారా? ఇక ముందు కూడా రాజ్–ఉద్ధవ్ కలిసి పోటీ చేస్తారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.
ఇక ఉద్ధవ్ ఠాక్రే శివసేన భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం అనంతం.. ఆయన వ్యూహాన్ని మార్చుకున్నారు. మహావికాస్ అఘాడీ నుంచి దూరమై, పాత విభేదాలను పక్కనపెట్టి సోదరుడితో చేతులు కలిపారు. కానీ ఇప్పుడు ఆ వ్యూహం ఫలించలేదు. బాలాసాహెబ్ వారసత్వాన్ని పదేపదే ప్రస్తావించినా.. ఓటర్లు పట్టించుకోలేదు. ఇందుకు మరికొన్ని కారణాలూ ఉన్నాయి. 25 ఏళ్లుగా బీఎంసీని పాలించిన శివసేనపై సహజంగా వ్యతిరేకత పెరిగింది. ఠాక్రే భారీ ర్యాలీలకన్నా ప్రెస్ కాన్ఫరెన్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలతో నేరుగా అనుసంధానం తగ్గింది. అంతే కాదు.. కేవలం మరాఠీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకోవడం మిగతా వర్గాలను దూరం చేసింది. హిందీ భాషపై రాజకీయాలు, హిందీ మాట్లాడేవారిపై దాడులు, ముంబై మేయర్ తప్పనిసరిగా మరాఠీ వాడే కావాలన్న హామీలు ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి.






